ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లేనా..?

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏటా తమ ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నక్రమంలో ఈ ఏడాదికి సంబంధించి
కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో తన తండ్రి ఏపీ మాజీ మంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షలు మాత్రమే పెరిగాయని లోకేష్ తెలిపారు. చంద్రబాబు మొత్తం ఆస్తులు రూ.9కోట్లు కాగా అందులో నికర ఆస్తి 3.87 కోట్లని అలాగే రూ.5.13 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఇక తన తల్లి నారా భువనేశ్వరి మొత్తం ఆస్తులు రూ.50.62కోట్లుగా ప్రకటించిన ఆయన, వీటిలో నికర ఆస్థి రూ.36.58కోట్లు కాగా, రూ.11.04కోట్లు అప్పులు ఉన్నట్టు చెప్పారు. గతేడాది ప్రకటించిన ఆస్తులతో పోల్చుకుంటే నికర ఆస్థి రూ. 8.50కోట్లు పెరిగాయని అంచనా వేసారు.
అలాగే నారా లోకేష్ ఆస్తులు మొత్తం రూ. 24.70కోట్లు కాగా వీటిలో నికర ఆస్థులు రూ.19కోట్లు అప్పులు రూ.5.70కోట్లుగా చూపించారు. నారా బ్రాహ్మణి మొత్తం ఆస్తి 15 కోట్ల 68 లక్షలని వీటిలో రూ.11.51కోట్లు నికర ఆస్థి కాగా అప్పులు రూ.4.17కోట్లుగా తెలిపారు. గతేడాది ప్రకటించిన నారా బ్రహ్మణి నికర ఆస్థి కన్నా ఇది రూ.3.80కోట్లు ఎక్కువ. అయితే ఇందుకు ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా అందించడమే కారణమని వివరించారు లోకేష్ . ఇక నారా దేవాన్ష్ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని గతేడాదితో పోలిస్తే నికర ఆస్థిలో రూ.71లక్షలు పెరిగాయని తెలిపారు.
దీంతో చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు కాగా మొత్తం అప్పులు రూ.26.04 కోట్లు. అయితే నిర్వాణ హోల్డింగ్స్ సంస్థ ఆస్తుల వివరాలను జతచేయలేదు. వాస్తవానికి చంద్రబాబు కుబుంబ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ అయిన నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్థులు రూ.9.10కోట్లు. గతేడాదిలో నికర ఆస్థిలో రూ. 2.27కోట్లు పెరిగినట్లు లోకేష్ తెలిపారు. అయితే రూ.37.20కోట్లు అప్పులుండగా వాటిని రూ.34.85కోట్లకు తగ్గించుకోగలిగామని వివరించారు.