13 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాలుగా విడగొడితే…

వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుందని మండలినే రద్దు చేసింది ప్రభుత్వం. ఇక జిల్లాల వంతు వచ్చింది. ఇప్పటికే 25 పార్లమెంట్ స్థానాలను జిల్లాలుగా చేయబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించింది. వీటితో పాటు మరో 3 కొత్త జిల్లాలు తెరపైకి వచ్చాయి.
కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా వీటిని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. ఇకపై దశల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
మచిలీపట్నం, అరకు, గురజాలల్లో వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలంటే రూ.500- రూ.600 కోట్ల వరకూ ఖర్చవుతోంది. అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి, అసలు ఎలాంటి వైద్య కళాశాలలు లేని బాగా వెనుకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే… అందుకయ్యే వ్యయంలో 60శాతం వరకూ భారత వైద్య మండలి  సమకూర్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న 3 ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. 
ప్రస్తుతం 13 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ప్రభుత్వం అనుకున్నట్టుగా జిల్లాలుగా విడగొడితే మొత్తం 28 జిల్లాలుగా రాష్ట్రం అవతరించనుంది. ఇది ఎప్పుడు కార్యరూపం దాల్చనుందో వేచి చూడాలి… 

Leave a Reply

Your email address will not be published.