*20లక్షల పంచాయతీ నిధులు గోల్ మాల్*

— ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసిన ఇంచార్జి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి
— కలెక్టర్ ఆదేశాలు భేఖాతార్ చేస్తున్న అధికారులు
— ఇంచార్జి సర్పంచ్ శేషగిరిరావు, పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ చర్యలు తీసుకోవాలి.
— విలేకరుల సమావేశంలో గ్రామపెద్దలు, వార్డు మెంబర్
ఖమ్మం : అక్రమంగా ఫోర్జరీ సంతకాలతో సుమారు 20లక్షల పంచాయతీ నిధులను గోల్ మాల్ చేసి డ్రా చేసిన ఇంచార్జి సర్పంచ్ ఇంజం శేషగిరిరావు, పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ పై చర్యలు తీసుకొని నిధులు రాబట్టాలని గ్రామ పెద్దలు, వార్డు మెంబర్ గద్దె అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలం, నూకాలంపాడు గ్రామపంచాయతీలో ఎస్టీలు లేనందున ఉపసర్పంచ్ ఇంచార్జి సర్పంచ్గా ఉంటారన్నారు. ఇంచార్జి సర్పంచ్ గా ఎన్నికైన ఇంజం శేషగిరిరావు, పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్లు కలిసి పంచాయతీ అభివృద్ధికి నిధులు ఖర్చు చేయాలి. కానీ వీరిద్దరూ కుమ్మక్కై 2013 నుండి12018 వరకు పంచాయతీ నిధులను ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేసుకున్నారు. పంచాయతీ లో పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్న మద్దినేని వెంకటేశ్వర్లు పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి 24వేలు డ్రాచేసుకున్నారు. ఊరిలో లేని ఇంజం వెంకటప్పయ్య పేరుతో 15వేలు, గుమస్తా బీరెల్లి భద్రయ్య ఫోర్జరీ సంతకాలతో 32వేలు, పంపు ఆపరేటర్ బండి వెంకటేశ్వర్లు పేరుతో 14వేలు ఇలా అక్రమంగా, ఫోర్జరీ సంతకాలతో పంచాయతీ నిధులన్నీ డ్రా చేసుకున్నారని ఆరోపించారు. వీరిపై జూలై నెలలో గ్రీవిన్స్ కలెక్టర్ కు పలు మార్లు విడివిడిగా ఫిర్యాదు చేశామని, దానిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు డిపిఓ, డిఎల్పీ, ఎంపిడిఓ ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాలు భేఖాతార్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ఇంచార్జి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకొని నూకాలంపాడు పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని వారు కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో మద్దినేని సత్యనారాయణ, పోట్ల శ్రీను, అంబులు సత్యనారాయణ, గోళ్ళ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.