అమెజాన్‌లో 2.0 లైవ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ -,- అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్ మూవీ 2.0 సంచలనాల గురించి తెలిసిందే. దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 600కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 450 కోట్ల మేర షేర్ వసూలైందని లెక్క తేల్చారు. కొన్నిచోట్ల పంపిణీదారులకు నష్టాలు వచ్చినా.. ఇండియన్ సినిమా హిస్టరీలో అద్భుతమైన టెక్నికల్ మూవీగా రికార్డులకెక్కింది. శంకర్ పనితనానికి, రజనీ, అక్షయ్ ల నటనకు గొప్ప గుర్తింపు దక్కింది. 2.0 సినిమాని 3డిలో శంకర్ తెరకెక్కించిన విధానం ఓ వండర్. అందుకే జనం 3డి థియేటర్లకు వెళ్లి చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. దాంతో 2డి థియేటర్లలో ఈ చిత్రం పెద్ద ఫ్లాపైందని విశ్లేషించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంత పెద్ద హిట్టవ్వలేదు. ఇక్కడ 80 కోట్ల మేర బిజినెస్ చేసినా కేవలం 53కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయగలిగిందని ట్రేడ్ లెక్కలు చెప్పింది. మరి డిజిటల్ ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ లైవ్ చేసేందుకు రెడీ అవుతోంది. 2.0 డిజిటల్ రిలీజ్ కోసం భారీ మొత్తం వెచ్చించిన అమెజాన్ .. ఈ సినిమాని సరైన టైమింగుతో రిలీజ్ చేయాలని నిర్ణయించింది. మార్చి తొలి వారంలో 2.0 డిజిటల్ లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇప్పటికే రోబో చిత్రం డిజిటల్ లో, యూట్యూబ్లో , బుల్లితెరపై ఓ సంచలనం అనే చెప్పాలి. ఆ తర్వాత మళ్లీ 2.0 చిత్రానికి అంతటి ఆదరణ దక్కుతుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. 2.0  చిత్రాన్ని 3డిలో వీక్షించే వెసులుబాటు ఆన్ లైన్ వీక్షకులకు ఉంటుందా?  ఏదైనా ప్రత్యేక ఆద్దం పెట్టుకుని చూసే వీలుందా? అంటూ కొత్త పాయింట్ ని వెతుకుతున్నారు. ఇక ఇది 2డి లో ఏ మేరకు రంజింపజేస్తుంది? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.

Leave a Reply

Your email address will not be published.