22న యథా ప్రకారం ఉరిశిక్ష అమలుఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు లైన్‌క్లియరైంది. ఈ కేసులో ముఖేశ్‌కుమార్‌ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. దీంతో ఉరిశిక్ష అమలకు పూర్తిగా అడ్డంకి తొలగిపోయింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ గురువారం రాష్ట్రపతి భవన్‌కు పంపింది. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌ దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. తిహార్ జైలు అధికారులకు కూడా ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. 

నలుగురు దోషులకు ఈనెల 22న ఉరి శిక్ష అమలు చేయాలంటూ జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది. అయితే ముఖేశ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున శిక్ష అమలును వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. జైలు నిబంధనల ప్రకారం.. కేసులో ఒకరికంటే ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు వారిలో ఒకరు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నా.. అది తేలే వరకు మిగిలిన వారికీ శిక్షను అమలు చేయడం కుదరదు. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే తాజా పరిణామాలతో ఉరిశిక్ష ఎప్పుడు అమలు చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 22న యథా ప్రకారం జరిగిపోతుందా? లేదంటే మరో తేదీ నిర్ణయిస్తారో వేచి చూడాలి. వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈనెలలోనే ఉరిశిక్ష అమలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  
 

Leave a Reply

Your email address will not be published.