23 ప్రాంతాల్లో మినీ థియేట‌ర్లు-ఆర్టీసీ స్థ‌లాల ఎంపిక పూర్తి-విజ‌య‌వాడ‌కు అధికారుల బృందం

23 ప్రాంతాల్లో మినీ థియేట‌ర్లు

ఆర్టీసీ స్థ‌లాల ఎంపిక పూర్తి
చ‌ల‌న చిత్ర అభివృద్ధి సంస్థ‌కు 15 జాగాలు
విజ‌య‌వాడ‌కు అధికారుల బృందం

అద‌న‌పు ఆదాయాన్ని స‌మ‌కూర్చుకునేందుకు ఖాళీ స్థ‌లాల్లో మినీ థియేట‌ర్ల‌ను నిర్మించాల‌ని తెలంగాణ ఆర్టీసీ నిర్ణ‌యించింది. తొలిద‌శ‌లో 23 డిపోలు, బ‌స్టాండ్ల‌ను ఎంపిక చేసింది. అక్క‌డ ఉన్న ఖాళీ స్థ‌లాల‌ను సద్వినియోగం చేసేందుకుమినీ థియేటర్లు, ప‌ల‌హార‌శాల‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆర్టీసీ  భావిస్తోంది. దీని పై తాజాగా అధికారులు క‌స‌ర్తు ప్రారంభించారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి ఆర్టీసీ రీజియ‌న్ల ప‌రిధిలో మినీ థియేట‌ర్ల నిర్మాణానికి ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు స్థ‌లాల‌ను లీజు ప్రాతిప‌దిక‌న ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ బ‌స్టాండు ఆవ‌ర‌ణ‌లోని ఖాళీ స్థ‌లంలో ఏపీ ఎస్ార్‌టీసీ అధికారులు ఇప్ప‌టికే మినీ థియేట‌ర్‌ను ఏర్పాటు చేశారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్య‌ద‌ర్శి పురుషోత్తం ఆధ్వ‌ర్యంలో అధికారుల బృందాన్ని త్వ‌ర‌లో విజ‌య‌వాడ పంపాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్ డైరెక్ట‌ర్ సేనీల్‌శ‌ర‌మ ఇటీవ‌లె ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

23 ప్రాంతాలివే
మినీ థియేట‌ర్ల నిర్మాణానికి 9 ఆర్టీసీ రీజియ‌న్ల‌లో ఆదిలాబాద్‌, నిర్మ‌ల్‌, ఆర్మూర్‌, బోధ‌న్‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌, క‌రీంన‌గ‌ర్‌, ధ‌ర్మ‌పురి, హుజూరాబాద్‌, సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, న‌ర్సాపూర్‌, సంగారెడ్డి, క‌ల్లూరు, కొత్త‌గూడెం, స‌త్తుప‌ల్లి, నాగార్జున‌సాగ‌ర్‌, కోదాడ‌, జ‌డ్చ‌ర్ల‌, చేవెళ్ల‌, తాండూరు, వికారాబాద్ బ‌స్టాండ్లు, ఆసిఫాబాద్‌, షాద్‌న‌గ‌ర్ బ‌స్ డిపోల‌ను ఎంపిక చేశారు. వీటిల్లోని 15 స్థ‌లాల్లో మినీ థియేట‌ర్ల‌ను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ ముందుకు వ‌చ్చింద‌ని సునీల్‌శ‌ర్మ తెలిపారు. వీటిద్వారా ఏడాదికి రూ.311 కోట్ల ఆదాయం ల‌భిస్తుంద‌న్నారు. అధికారుల బృందం అధ్య‌య‌నం చేశాక తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published.