ఉల్లి మీద చర్చ పై అసెంబ్లీ లో [విపక్షాలపై విరుచుకు పడిన జ’గన్ ‘

  దేశ వ్యాప్తంగా ఉల్లి ధ‌ర‌లు పెరుగుతుంటే కేవ‌లం ఏపిలోనే ధ‌ర‌లు పెరుగుద‌ల ఉన్న‌ట్టు వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ విప‌క్షాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసారు.  సోమవారం అసెంబ్లీలో ఉల్లి ధరల అంశంపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడుతూ దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా  ఏపీలోనే కిలో ఉల్లి రూ.25కు అమ్ముతున్న విష‌యాన్ని ఎందుకు గ‌మ‌నించ‌ర‌ని సీఎం జగన్ మండి ప‌డ్డారు.
   ఇదే చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు రాక, పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశామని, కానీ త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉల్లి రైతులకూ మంచిరేటు లభిస్తోందన్నారు. అయితే పెరిగిన ధ‌ర‌లు వినియోగదారులకు నష్టం క‌లిగించేలా ఉండ‌టంతో మన రాష్ట్రంలో ఉల్లి లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలుచేసి రైతు బ‌జార్ల‌లో కేజీ రూ.25లకు అమ్ముతున్నామ‌ని చెప్పారు. ఇంతవరకు 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని జగన్ వ్యాఖ్యానించారు.  
 ఉల్లి రైతుల‌కు గిట్టుబాటు క‌ల్పించామ‌ని ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి త‌న ప్ర‌సంగంలో రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని షోలాపూర్, ఆల్వార్‌ లాంటి ప్రాంతాలనుంచి కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్ప‌డం కొస‌మెరుపు.


————–
నిన్నటి వరకూ కిలో రూ.60 ఉండే ఉల్లి.. ఏపిలో నేడు రూ.120కు ఎగబాకడంతో వినియోగదారులు ‘ఉలి’క్కి పడుతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి అవాక్కవుతున్నారు. ప్రభుత్వం రైతుబజార్లలో ద్వారా రాయితీ ప్ర‌క‌టించినా, అవసరం మేర నిల్వలు దిగుమతి త‌క్కువ‌గా ఉండ‌టం, పంపిణీ స‌మ‌యాలు నిర్ధిష్టంగా లేక పోవ‌టం వ‌ల్ల‌ ఉల్లి కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వ‌స్తోంది. ఈ  రాయితీ ఉల్లి కోసం విశాఖ ఎంవీపీ కాలనీలోని రైతు బజార్‌ వద్ద వినియోగదారులు బారులు తీరినా, క్ర‌మంగా వినియోగ‌దారులు కోసం పోటెత్తారు. దీంతో నియంత్రించలేక అధికారులు చేతులెత్తేయ‌టంతో ఇక్క‌డ‌ తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసారు.  

ఆదివారం సెలవు రోజున పంపిణీ నిల‌పి వేయ‌టం వ‌ల్ల కార్యాల‌యాల‌కు సెల‌వు పెట్టి మ‌రీ క్యూలైన్ల‌లో నిలుచోవ‌ల‌సి వ‌స్తోంద‌ని, కేవ‌లం కిలో మాత్ర‌మే ఇచ్చేందుకు అధికారులు నిర్ణ‌యించ‌డం ప‌ట్ల వినియోగ దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అవ‌స‌రాల‌కు త‌గినంత‌ ఉల్లిని సరఫరా చేయలేదని,  అందుకే ఉల్లి అమ్మ‌కాలు దారుణంగా ప‌డిపోయామ‌ని, ధ‌ర‌లు మాత్రం ఆకాశాన్నిఅంటాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు.  కాగా కర్నూలు ఉల్లిని కిలో రూ.25కే అందజేస్తుండ‌గా. మైదుకూరులో రూ.50కు మార్కెటింగ్‌ శాఖ విక్రయిస్తోంది.  ఈ త‌ర‌హాలో ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్నఉల్లి విక్ర‌య కేంద్రాల లో రేట్లు బాగా హెచ్చుత‌గ్గులు ఉండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్త మ‌వుతోంది.  

మ‌రోవైపు  రైతుబజార్లలో రాయితీపై పంపిణీ చేస్తున్న ఉల్లిపాయల సేకరణకు ప్రభుత్వం మార్కెట్‌ స్థిరీకరణ నిధి నుంచి రూ.20 కోట్లు విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రైతులు లేదా ఉత్పత్తిదారుల సంఘాల నుంచి ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్‌ శాఖకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్ప‌టికే ఉల్లి రేటు రోజు రోజుకీ పెరుగుతుండ‌టంపై అధికార పార్టీలో ఆందోళ‌న క‌నిపిస్తుంటే, ఈ అంశంపై విప‌క్షాలు త‌మ‌దైన శైలిలోఆరోప‌ణ‌లు గుప్పిస్తుండ‌టం విశేషం.

Leave a Reply

Your email address will not be published.