బాహుబలి -3లో అవెంజర్స్ స్టార్

బాహుబలి – ది బిగినింగ్, బాహుబలి- ది కన్ క్లూజన్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 2500 కోట్లు వసూలు చేసాయని క్రిటిక్స్ అంచనాలు వేసారు. ఆ క్రమంలోనే ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాలకు సీక్వెల్ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. లేదూ ప్రీక్వెల్ ఆలోచనలో ఉన్నారని కూడా ప్రచారమైంది. కానీ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో బిజీ అయ్యారు. అయితే బాహుబలి సిరీస్ లో మూడో చిత్రం తెరకెక్కుతుందా.. లేదా? అన్నది అటుంచితే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్టార్ల మనసుల్ని దోచింది అనడానికి ప్రఖ్యాత హాలీవుడ్ స్టార్ చేసిన కామెంట్ ఓ నిదర్శనంగా నిలుస్తోంది. హాలీవుడ్ భారీ యాక్షన్ అడ్వెంచర్స్  మూవీ అవెంజర్స్ నటుడు శ్యామ్యూల్స్ ఎల్.జాక్సన్ ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..

బాహుబలి 3 తెరకెక్కిస్తే ఆ చిత్రంలో నటించాలనుందని వ్యాఖ్యానించడం సంచలనమైంది. కెప్టెన్ మార్వెల్ ప్రచారం కోసం అతడు ఇండియాకి పయనమయ్యే ఆలోచనలోనూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇండియాకు వెళ్తారా అని హోస్ట్ తనని ప్రశ్నించగా.. నాకు పని కల్పిస్తే వెళ్తా అంటూ జాక్సన్ అన్నారు. అనంతరం బాలీవుడ్లో పనిచేస్తారా? అని  ప్రశ్నిస్తే .. బాహుబలి 3 చిత్రం కోసం పనిచేయాలని ఉంది అన్నారు. దీంతో మరోసారి బాహుబలి ఫ్రాంఛైజీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన కెప్టెన్ మార్వెల్ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజై పాజిటివ్ సమీక్షలు అందుకుంది. అవెంజర్స్, పల్ప్ ఫిక్షన్ సహా వందలాది చిత్రాల్లో శ్యామ్యూల్స్ జాక్సన్ నటించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యను మన జక్కన్న గమనించి ‘బాహుబలి 3’ ని ప్లాన్ చేస్తారా? అంటూ చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published.