జనవరి 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం :

రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జనవరి 31వ తేదీన భూకర్షణం, బీజావాపనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలంలో భూకర్షణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టితో కలిసి ఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ జనవరి 31న ఉదయం 9.15 నుండి 9.40 గంటల మధ్య భూకర్షణ కార్యక్రమం జరుగనుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు రానున్నారని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఆగమశాస్త్రం ప్రకారం భూకర్షణ చేయడం ఆనవాయితీ అని, ఆగమ సలహాదారుల సూచన మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. సిఆర్‌డిఏ 25 ఎకరాలు టిటిడికి కేటాయించిందని, ఇందులో 5 ఎకరాల్లో శ్రీవారి ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి ఆధ్యాత్మిక కార్యకలాపాల నిర్వహణ కోసం ఆడిటోరియాలు, కల్యాణమండపాలు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. దాదాపు రూ.140 కోట్లతో  ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టిటిడి ధర్మకర్తల మండలి టెండర్లు ఖరారు చేసినట్టు వెల్లడించారు.

శ్రీవారి భక్తుల కోరిక మేరకు గత ఏడాది జులైలో కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని, ఇక్కడ రోజువారీగా వెయ్యి నుండి 2 వేల మంది, ఉత్సవాల రోజుల్లో 10 వేల నుండి 15 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారని ఈవో తెలిపారు. జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని, మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామన్నారు. విశాఖపట్నం, భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలతోపాటు చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ధర్మప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి తిరుమల తరహాలో సంప్రదాయబద్ధంగా కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు.

భూకర్షణం కోసం హోమగుండాలు, వేదిక, సిఆర్‌డిఏ స్టాళ్లు, ఆలయ నమూనా ఎగ్జిబిషన్‌, ప్రత్యక్ష ప్రసారాలు, డిస్‌ప్లే స్క్రీన్లు తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని ఈవో తెలిపారు.  భూకర్షణంలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామన్నారు. భూకర్షణం తరువాత 10 రోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు చేపడతారని వివరించారు. ఆ తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.

శ్రీవారి సేవకులకు ఆహ్వానం …

గౌ|| ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ కార్యక్రమానికి శ్రీవారి సేవకులను, భజన మండళ్ల సభ్యులను ఆహ్వానిస్తున్నామని ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. శ్రీవారి సేవకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ వెంకట నగేష్‌, ఈఈ శ్రీప్రసాద్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్రుడు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీవేణుగోపాల్‌, ఏఈవో శ్రీ గోవిందరాజులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.