ఆ 40 కేసుల్లో నిందితుల ఎన్‌కౌంట‌ర్‌కి జ‌గ‌న్ ఆదేశాలిస్తాడా?ఏపీలో అసెంబ్లీ సమావేశాలలో ‘మహిళలకు రక్షణ ఎలా కల్పించాలి” అనే విషయంలో చర్చ స‌మ‌యంలో సీఎం జగన్ “దిశ” నిందితులను ఎన్ కౌంటర్ విషయాన్ని సమర్ధిస్తునే ‘అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్’…అని వ్యాఖ్యలు చేసారు. ఇదే ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. జ‌గ‌న్ పరిభాష చూస్తుంటే దిశా హంతకుల్ని ఎన్ కౌంటర్ చేయమని తెలంగాణ సిఎం కేసీఆర్ పోలీసులకు ముందే ఆదేశించార‌న్న‌ట్టుంది. అయితే వారు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో పాటు త‌మ నుండి ఆయుధాలు లాక్కుని, దాడి చేసినందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెపుతున్న‌ది నిజంకాదన్న‌మాట అని చాలా మంది సామాజిక మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే ఇది బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్ అంటూ వ‌చ్చిన ఫిర్యాదుల‌తో స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై చాలా సీరియస్ గా రియాక్ట‌య్యి, నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని కూడా పంపింది. అయితే జ‌గ‌న్‌-కేసీఆర్‌ల మ‌ధ్య సంబంధాల మేర‌కే ఇప్పుడు జగన్ కెసిఆర్ ముందుగ‌నే నిందితుల‌ను ఎన్ కౌంట‌ర్ చేయ‌మ‌న్నార‌నే తీరుగా చెపుతుండ‌టం చూస్తుంటే ఈ విష‌యం జ‌గ‌న్‌కి కూడా ముందే తెలుసి ఉండొచ్చ‌ని సెటైర్లు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్ ఇది కేసీఆర్ నిర్ణ‌య‌మ‌న్న త‌ర‌హాలో ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వానికి కొత్త‌ తల నొప్పి తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు!.
ఇదిలా ఉండగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల మేర‌కు అత్యాచార నిందితుల‌ను ఎన్ కౌంట‌ర్ చేయ‌ట‌మే స‌మంజ‌స‌మైన‌ప్పుడు 2019 జగన్ సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో దాదాపు 40 పైగా రేప్ కేసులు పెండింగ్‌ లో ఉన్నాయి. వారందర్ని, జగన్ కూడా కెసిఆర్ పంథాలో ఎన్ కౌంటర్ చేసేలా ఆదేశించాల‌న్న‌ డిమాండ్లు ఇప్పుడు ఊపందుకునే అవకాశాలు లేకపోలేదు.
మరోవైపు మహిళా సంఘాలు సైతం, అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటన్న వారిని చంపేయాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ సీఎం మాటలు వారికి మరింత ఊతం ఇచ్చినట్లయిందని నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు. కాగా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 2014లో 82, 2015లో 100, 2016లో 116, 2017లో 105, 2018లో 93 కేసులు న‌మోద‌య్యాయి. వీటి విష‌యం కూడా త్వ‌ర‌గా తేల్చాల‌ని, నిందితుల‌ని ఎన్ కౌంట‌ర్ చేయ‌టం ద్వారానే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త అన్న‌డిమాండ్ తెర‌పైకి వ‌స్తోంది. మ‌రి ఈ కేసుల విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తను చేసుకు పోతుంద‌ని చెపుతారో… ఎన్ కౌంట‌ర్ల‌కు ఆదేశాలిచ్చి త‌నూ కేసీఆర్‌లా శ‌భాష్ అనిపించుకుంటారో చూడాలి…

Leave a Reply

Your email address will not be published.