ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం

శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలో 41 రోజుల మండల దీక్షా పూజలు నేటితో ముగియనుండటంతో భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం సాయంత్రం మండల పూజ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నామని ఆలయ తంత్రి మీడియాకు చెప్పారు. శుక్రవారం మూసివేసిన ఆలయం మకరవిలక్కు(మకరజ్యోతి) ఉత్సవాలకు డిసెంబర్ 30న తిరిగి తెరుస్తామని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు గత ఆదేశాల నేపథ్యంలో మహిళలు భారీగా వచ్చే అవకాశం ఉందని అంతా భావించినప్పటికీ గత ఏడాది జరిగినంత హడావిడి ఇక్కడ కనిపించకపోవటం విశేషం. దీనికితోడు కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చేయటంతో ఈసారి ఎలాంటి నిరసనలు లేకుండా ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం భక్తులు చేసుకున్నారనే చెప్పాలి. గతం కన్నా అధికంగా శబరి గిరీశుని దర్శించుకునేందుకు అయ్యప్ప మాలాధరులు పోటెత్తడంతో శబరి కొండలు శరణుఘోషలతో మిన్నంటాయి. అలాగే ఆలయానికి భారీగా దాయం సమకూరినట్టు ఆలయ అధికారులు చెప్పారు.