విజయవంతంగా కక్ష్యలో చేరిన పిఎస్ఎల్వి-సి 48

అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న ఇస్రో వరుస ప్రయోగాలలో భాగంగా బుధవారం పంపిన పిఎస్ ఎల్వి-సి 48 రాకెట్ ప్రయోగం విజయవంతం కావటంతో మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని ఒకటో లాంఛ్ ప్యాడ్ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ను ప్రయోగించింది.
ఇందుకు సంబంధించి కౌంట్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 4.40 గంటలకు ప్రారంభించి, 22.45 గంటల సమయం కొనసాగించారు. బుధవారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు రాకెట్ ప్రయోగం నిర్వహించారు. పిఎస్ఎల్వి రాకెట్ల సీరిస్ లో 50వ రాకెట్ ప్రయోగం.ఈ ఏడాది షార్ నుంచి 6వ ప్రయోగం కాగా శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కావటం విశేషం.
ఈ పీఎస్ఎల్వీ-సి48 వాహకనౌకలో మన దేశానికి చెందిన రీశాట్-2 బీఆర్1తో పాటు విదేశాలకు చెందిన 9ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. వీటిలో అమెరికా 6, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.. రీశాట్-2బీఆర్1 బరువు 628 కేజీలని శాస్త్ర వేత్తలు చెప్పారు.
అలాగే రాకెట్ ప్రయోగం ముందు ఇస్రో సంప్రదాయంగా వస్తున్నట్టే ఈ సారి కూడా ఇస్రో ఛైర్మన్ శివన్ శ్రీవారిని దర్శించుకుని స్వామివారి పాదాల ముందు పిఎస్ఎల్వి-సి 48 నమూనాను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు తమిళ ఆరాధ్యదైవమైన సూళ్లూరుపేట చెంగాలమ్మను కూడా దర్శించుకుని ప్రయోగం విజయవంతం కావాలని కోరుకున్నారు.