మార్చి 6న `ఓ పిట్ట కథ`

అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్టుప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు నిర్మాత ఆనంద ప్రసాద్ ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తన కార్యాలయంలో విడుదల చేస్తూ, “ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే“ అంటూ సాగే మెలోడీ పాటను `బుట్టబొమ్మ` పూజా హెగ్డే చేతులమీదుగా వేలెంటైన్స్ డే రోజున విడుదల చేసామని, దానికి అందరి నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుతున్నాయని అన్నారు. ఈ పాట కోసం ప్రముఖ దర్శకుడు వంశీ చేసిన ప్రయోగాన్ని మరోమారు చేసామని, `లేడీస్ టైలర్` కోసం ”ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే ” పాట విజువల్స్ షూట్ చేశాకే ఇళయరాజాతో బాణీని సిద్ధం చేయించారు. ఈ పాటలోనూ తాము అదే తరహాలో చేసామని చెప్పారు. ఈ పాటను అమలాపురం, కాకినాడ పరిసరాల్లో చిత్రీకరించాం అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. “ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగే కథ ని అనేక మలుపులతో ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగించేలా రూపొందించామని చెప్పారు. చిత్రంలొని ట్విస్టులు థ్రిల్ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుందని అన్నారు.