రాజధాని మార్పుతో కట్టాల్సిన పరిహారం….72 వేల కోట్లు.!

 
రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే రైతులకు సుమారు రూ.72 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని వివిధ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొందరు బీజేపీ నేతలు రూ.లక్షన్నర కోట్లు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం లెక్కిస్తే .. రూ.72 వేల కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి వస్తుందని నిపుణులతో పాటు రాజధాని రైతులు కూడా
స్పష్టంచేస్తున్నారు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో గజం భూమి విలువ రూ.5వేలుగా ఉంది. జరీబు ప్రాంతంలో ఎకరాకు 1,450గజాలను రైతులకు రిటర్నబుల్‌ ప్లాటుగా ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు భూమికి భూమి కాకుండా భూసేకరణ చట్టం ప్రకారం చూస్తే.. ఈ 1,450గజాల విలువ రూ.72.50 లక్షలు. ఇది రిజిస్ర్టేషన్లు జరుగుతున్న విలువ మాత్ర మే. 2013చట్టం ప్రకారం అక్కడున్న విలువకు మూడు రెట్లు అధికంగా రైతుకు పరిహారమివ్వాల్సి ఉంటుంది.
అంటే ఒక్క ఎకరానికి రూ.2.17కోట్లు చెల్లించాలన్న మాట. ఈ లెక్కన రైతుల నుంచి సమీకరించిన 33వేల ఎకరాలకు సుమారు రూ.72వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందం లో 9.14 ఫాంలోని 18వ షరతు ప్రకారం.. ప్రభుత్వం ఏ షరతునైనా ఉల్లంఘిస్తే 2013 చట్టం కింద పరిహారమివ్వాలని పేర్కొన్నారు. భూసమీకరణ విధానంలో భూములు తీసుకున్నప్పుడు రైతులు మొదటి పార్టీగా, ప్రభుత్వం రెండోపార్టీగా పేర్కొంటూ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలోని 18వ షరతులో…షెడ్యూలు ఆస్తిపై అభివృద్ధి పనులు నిలుపుదల చేయాలని మొదటి పార్టీ (రైతులు) కోరరాదు. అదేవిధంగా రెండో పార్టీ.. అంటే ప్రభుత్వం కనుక ఒప్పందం ఉల్లంఘిస్తే నష్టపరిహారం.. ‘చట్టప్రకారం అర్హమైన నష్టపరిహారాలు పొందుటకు అర్హులై ఉన్నారు..’ అని పేర్కొన్నారు. దీనిప్రకారం రాజధానిని తరలించి.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు.

*పైసా ఖర్చులేకుండా నడుస్తుంటే..*

అమరావతిలో రాజధాని నిర్మించాలంటే రూ.లక్ష కోట్లు అవుతుందని.. మరోచోటకు మార్చేస్తే అది మిగిలిపోతుందని.. మార్చాలనుకున్న చోట రూ.3,500కోట్లతో అవసరమైన కొన్ని భవనాలను నిర్మిస్తే సరిపోతుందని జగన్‌ ప్రభుత్వం వాదిస్తోంది. ఇంత డొల్ల వాదన మరోటి లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే గత ఏడు నెలల్లో అమరావతిపై ఒక్క పైసా ఖర్చుపెట్టకుండా పాలన సాగిందనేది అందరికీ తెలిసిన విషయమే. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ నడిచాయి. నడుస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం వద్ద నిధులు లేవనుకుంటే.. ఇప్పటివరకు నడిపించినట్లే ఇకముందూ ఇక్కడినుంచే పాలన సాగించవచ్చు. నిధుల లభ్యత ఉన్నప్పుడు కొంత మొత్తం చొప్పున అమరావతిలో పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అమరావతిలోని భవనాల నిర్మాణానికి రూ.3,500కోట్లు ఖర్చవుతుందని బీసీజీ నివేదిక పేర్కొంది. అందులో మూడోవంతు ఖర్చుచేసినా అమరావతిలో ప్రస్తుతం 80శాతం పూర్తయిన భవనాలు పూర్తి చేసేయవచ్చని అంచనా. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఇస్తున్న భారీమొత్తం అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేకుండా వారికి క్వార్టర్లు కేటాయించవచ్చు. ఇప్పటివరకూ ఈ భవనాలపై చేసిన ఖర్చుకూ సార్థకత లభిస్తుందని అంటున్నారు.ఇక్కడే మరిన్ని వసతులు..
అమరావతి నిర్మాణానికి ఇప్పటికే సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చు చేశారు. అందులో కొంత ఖర్చుతో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు పూర్తిచేశారు. మరికొన్ని నిధులతో రోడ్ల పనులు ప్రారంభించారు. ఇంకొంత వ్యయంతో పలు భవనాలను 70-80 శాతం వరకు పూర్తిచేశారు. ఏతావాతా చూస్తే.. రాజధానిని ఇక్కడే ఉంచితే ఇప్పటివరకు పెట్టిన ఖర్చుకు ప్రయోజనం ఉంటుంది.. కొత్తగా మరోచోట పెట్టడం కంటే తక్కువ ఖర్చుకే ఇక్కడ మరిన్ని సౌకర్యాలూ కల్పించవచ్చు.. ఒకవేళ ఆ చిన్నమొత్తాలు కూడా కష్టమనుకుంటే.. పైసా ఖర్చులేకుండా ఇప్పుడు నడుస్తున్నట్లే రాజధానిని నిర్వఘ్నంగా కొనసాగించుకోవచ్చు. ఈ విషయాన్ని పలు ప్రజాసంఘాలు, చివరకు అమరావతి రైతులు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని డిమాండ్‌ చే స్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.