‘ట్రంప్’ను చంపి తెస్తే 80 మిలియన్ డాలర్లు … ఇరాన్ ప్రకటన

ఇరాన్ పగతో రగిలిపోతుంది. దెబ్బకు దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తోంది. అమెరికాపై కసితో రగిలిపోతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఇందు కోసం ప్రణాళికలు రచిస్తోంది ఇరాన్. సైనిక జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంతో నిప్పులు చిమ్ముతోంది.తాజాగా డొనాల్డ్ ట్రంప్ తలకు వెల పెట్టింది. ట్రంప్‌ను చంపి తెస్తే 80 మిలియన్ డాలర్ల (రూ 575.44 కోట్లు) నజరానాను ప్రకటించింది. ‘ఇరాన్ జనాభా 80 మిలియన్లు (8 కోట్లు). ఒక్కో ఇరాన్ పౌరుడూ తమ వాటాగా ఒక డాలరును ట్రంప్‌ను హత్య చేసే వారికి అందజేస్తారు. ఇది దేశం తీసుకున్న నిర్ణయం’ అని అధికారికంగా ప్రకటించారు.
సులేమానీ అంతిమ యాత్ర సాగుతున్న సమయంలో అధికార వార్తాసంస్థ పదేపదే ఈ ప్రకటనను ప్రసారం చేసింది. లక్షల మందితో టెహరాన్ వీధులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. నల్లటి దుస్తులు ధరించి, తమ హీరో సులేమానీ చిత్రపటాన్ని చేత పట్టుకుని ‘అమెరికాకు చావు తప్పదు’, ‘ట్రంప్‌ను చంపేస్తాం’ అంటూ ప్రజలు నినదించారు. అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను దహనం చేశారు. వందల సంఖ్యలో ప్రజలు ఛాతీలు చరిచి బాధను పంచుకున్నారు. అధినేత ఆయతుల్లా ఖొమైనీ కూడా కన్నీరు ఆపుకోలేక ఏడ్చేశారు. 80 ఏళ్ల ఖొమైనీకి సులేమానీతో అత్యంత ఆత్మీయ బంధం ఉంది. ఎన్నోసార్లు ప్రజా కార్యక్రమాల్లో బహిరంగంగా సులేమానీ నుదుటిపై ఖొమైనీ ముద్డాడిన సందర్భాలున్నాయి. సులేమానీ కూడా ఒక్క ఖొమైనీకి మాత్రమే జవాబుదారు. దేశ ప్రధానికి కూడా కాదు. ఖుద్స్ ఫోర్స్ కొత్త చీఫ్ ఇస్మాయిల్ క్వానీ కూడా కంటతడి పెట్టారు. సులేమానీ మృతదేహాన్ని ఆయన సొంత పట్టణం కెర్మన్‌లో ఇవాళ ఖననం చేయనున్నారు.