ఈనెల 9వరకు అంత్యక్రియలు ఆపండి ……. హైకోర్టు కీలక ఆదేశాలు

 నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ కొన్ని మహిళా సంఘాలు  హైకోర్టుకు లేఖ రాశాయి. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై స్పందించిన హైకోర్టు ఈనెల 9 వరకు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవద్దని జారీ చేసింది . కేసును 9వ తేదీన విచారణ జరపనున్నట్టు తెలిసింది. మరోవైపు ఆ నలుగురు నిందితులను  నకిలీ హత్య చేశారని, ఆఎన్కౌంటర్ లో పాల్గొన్న  పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ముంబైకి చెంది న్యాయవాది గురునాథ సదావర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. జాతీయ మానవహక్కుల కమిషన్, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ డీజీపీకు కూడా లేఖ రాశారు.


ఈ లేఖ సారాంశం : హైదరాబాద్ రేప్, మర్డర్ కేసులో నలుగురు నిందితుల్ని ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో చంపేశారు. ఈ ఎన్ కౌంటర్ పేరుతో కష్టడీ హత్యకు ఉన్న అన్ని లక్షణాలను కలిగి ఉంది. అనుమానితులు పోలీసు కష్టడీలో ఉండటం, ఆ కారణంగా వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండకపోవటం- పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. వీళ్లు నలుగురు అనుమానితులే అనే విషయం మర్చిపోకూడదు. లాకప్పు ఒప్పుదలలు తప్ప, వీరు నిందితులని రుజువు చేసే సాక్ష్యం ఏమైనా ఉందో లేదో మనకు తెలియదు. ఈ ఒప్పుకోవడాలను భారతదేశంలో పోలీసులు అలవాటుగా హింస ద్వారా చేయిస్తారు. హింస ఎప్పుడు నిజాన్ని వెలికి తీయదు. కాబట్టి ఈ చనిపోయిన నలుగురు, హైదారాబాద్ డాక్టర్ ను నిజంగా హత్య చేసి చంపిన వారు అవునో కాదో తెలియదు.
ఇలాంటి కష్టడీ మరణాలు తప్పదు అని వాదించేవారు ఇంకో సారి ఆలోచించండి. హైదరాబాద్, తెలంగాణ పోలీసులు ఇలాంటి హత్యలకు చెడుగా పేరుబడ్డారు. 2008లో ఆసిడ్ దాడి కేసులో ముగ్గురిని కస్టడి హత్యకు గురి చేశారు. ఆ హత్యలు హైదారాబాద్, తెలంగాణ లేక భారతదేశంలో మహిళల మీద నేరాలను తగ్గించలేదు. యాసిడ్ దాడులు, అత్యాచారాలు, మహిళా హత్యలు ఎలాంటి శిక్షలు లేకుండా జరుగుతూనే ఉన్నాయి.
మేము ఈ ఎన్ కౌంటర్ విషయంలో పూర్తి విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎన్ కౌంటర్ కు బాధ్యులైన పోలీసులను అరెష్టు చేసి, విచారణ చేసి, కోర్టులో హత్యకు గురి అయిన నలుగురిని ఆత్మ రక్షణార్ధం మాత్రమే చంపామని రుజువు చేసుకోమనాలి. ఇది మానవ హక్కులకే కాదు, మహిళల హక్కులకు కూడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎలాంటి జవాబుదారీతనం లేకుండా, ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కొకుండా చంపగలగటం అంటే- వాళ్లు మహిళలను కూడా అత్యాచారం చేసి, ఎలాంటి ప్రశ్నలు ఉండవనే ధీమాతో చంపగలరు.


మేము, మహిళా ఉద్యమకారులం, మహిళలకు నిజమైన న్యాయం కొరకు పోరాడుతూనే ఉంటాం. మేము పోలీసులు వారి విధులను నిర్వర్తించాలనీ, మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని కోరుకొంటాం. వారిని జడ్జీలుగా, తలారీలుగా వ్యవహరించాలని కోరుకోం. పోలీసులు రేపిష్టులుగా ప్రకటిస్తూ హత్య చేసే పౌరాణిక ‘సామూహిక చేతన’ ను కోరుకోం. మేము మార్పు కోరుకొనే సమాజపు చేతనను ఆశిస్తాం. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో మహిళలకు అండగా ఉంటూ గౌరవంగా చూడటాన్ని కోరుకొంటాం. బాధితురాలిపైనే నింద, అత్యాచార సంస్కృతులను తిరస్కరించటంలో ఇంకా క్రియాశీలకంగా, జాగురుతతో ఉండాలని కోరుకొంటాం.’ 

Leave a Reply

Your email address will not be published.