96కి రిపేర్లు .. చెడగొట్టరు కదా?
తమిళంలో 2018 సూపర్‌హిట్ గా నిలిచిన `96` తెలుగులో రీమేకవుతున్న సంగతి తెలిసిందే.. ఎక్స్పెక్ట్ చేయని జంట విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్రిష కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన సినిమాగా నిలిచింది. ప్రతీ ప్రేమికుడిని తన గత జ్ఞాపకాల దొంతెరల్లో విహరింపజేసే కథా, కథనంతో 96 కాలంనాటి మేకింగ్‌తో ఆద్యంతం ఆసక్తికర స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ సినిమాపై ఇతర భాషల మేకర్స్ మనసుపడుతున్నారు. దీంతో ఈ సినిమా రీమేక్ హక్కులపై భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంత డిమాండ్ వున్నా రిలీజ్‌కు ముందే ఈ చిత్రాన్ని చెన్నైలో ప్రత్యేకంగా చూసిన దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు.
గత కొన్ని రోజులుగా తెలుగు రీమేక్‌లో నటించే బెస్ట్ జోడీ కోసం అన్వేషించిన దిల్ రాజు మొత్తానికి ఆ జంటను ఫైనల్ చేశాడు. శర్వానంద్- సమంత జోడీని ఫైనల్ చేసేశాడు. తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ నే తెలుగు రీమేక్ కు దర్శకుడిగా తీసుకున్నారు. అంతా బాగానే వుంది. అయితే కథ, కథనం తమిళ నేటివిటీకి దగ్గరగా వుండటంతో తెలుగు ప్రేక్షకుల కోసం చిత్ర బృందం మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టింది. సోల్ మిస్సవకుండా మార్పులు చేస్తే మంచిదే కానీ సోల్‌ని పక్కన పెట్టి ఇదే కథ అంటూ సెట్స్‌కి వెళితే మాత్రం లెక్కలు మారిపోవడం ఖాయం. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని చేస్తే తెలుగు తెరపై `96` ఓ క్లాసిక్‌గా జేజేలు అందుకోవడం ఖాయం.