ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్: “ధన బలమైతే బలుపులో కనిపిస్తుంది.. కానీ..”

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ ట్రైలర్‌‌ రిలీజ్ అయ్యింది. ” ధన బలమైతే బలుపులో కనిపిస్తుంది.. కానీ ఇది జన బలం.. ఒక్క పిలుపులో వినిపిస్తుంది” అనే డైలాగ్‌‌ నందమూరి అభిమానులను ఆకట్టుకుంటోంది. డైలాగ్‌‌లు చెప్పడంలో తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్న నందమూరి బాలయ్య తాజాగా విడుదల చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్‌‌లో డైలాగ్‌‌లు అదరగొట్టారు. అచ్చుగుద్దినట్లుగా దివంగత నటుడు, నేత ఎన్టీఆర్‌ లాగే గెటప్, ఆహార్యం అదిరిపోయింది. “జనం కోసమే సినిమా అనుకున్నాను.. జనానికే అడ్డు అయితే సినిమా కూడా వద్దంటాను” అనే మరో డైలాగ్‌‌ కూడా అభిమానులకు బాగా కనెక్ట్ అవుతోంది. అరవై ఏళ్లు వస్తున్నాయ్.. ఇన్నాళ్లు మా కోసం బతికాం.. ఇక ప్రజలకోసమే.. ప్రజా సేవలో బతకాలనుకుంటున్నా అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ అరగేంట్రానికి సంబంధించిన సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. మరోవైపు ప్రకాష్ రాజ్‌‌ కూడా డైలాగ్‌‌లతో ఆకట్టుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆడియో వేడుక ప్రారంభమైంది. హైదరాబాద్‌‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌‌లో జరుగుతున్న ఈ వేడుకకు నందమూరి కుటుంబీకులతో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నందమూరి ఎన్టీఆర్ కుమార్తెల చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వేడుకకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, సూపర్‌స్టార్ కృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వర్లు, మంచు మోహన్ బాబు, దర్శకధీరుడు రాఘవేంద్రరావు, కృష్ణం రాజు, పరుచూరి బ్రదర్స్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, టి. సుబ్బరామిరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌, తారకరత్న‌, కొరటాల శివ, నరేశ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published.