ఈ. బి . సి రిజర్వేషన్ల ను వ్యతిరేకిస్తూ బీసీ ల అర్థనగ్న ప్రదర్శన

 అగ్ర కులాలు తమకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు చేయకపోయినా కేంద్రం అగ్ర కులాల్లో వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘాల నాయకులు, కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్వర్యంలో బుధవారం బషీర్‌బాగ్ చౌరస్తాలో వందలాది మంది కార్యకర్తలు అర్థ నగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గుజ్జ కృష్ణ ప్రసంగిస్తూ స్వాతంత్య్రం లభించి 71 సంవత్సరాలైనా కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన పార్టీలన్నీ బీసీలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఈబీసీలు 9 శాతం ఉన్నా, 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. 52 శాతం ఉన్న బీసీలకు మాత్రం 25 శాతమే ఇస్తారట అని ఆయన అన్నారు. దేశ సంపద, పరిశ్రమలు, డబ్బు, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టులు, అధికారం వంటివి 15 శాతం జనాభా ఉన్న అగ్ర కులాల చేతుల్లో 90 శాతం వరకు ఉన్నాయని, అటువంటప్పుడు వీటిని కూడా కులాల జనాభా ప్రకారం రిజర్వ్ చేస్తారా? అని గుజ్జ కృష్ణ ప్రశ్నించారు.

అగ్రకులాలు అడగకుండానే..
అగ్ర కులాలు తమకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు చేయకపోయినా కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించడం విస్మయం కలిగిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని 26 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని బుధవారం కృష్ణయ్య అధ్యక్షతన సమావేశమైన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనీపై రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం దురదృష్టకరమని కృష్ణయ్య అన్నారు.

Leave a Reply

Your email address will not be published.