కాపు నేస్తం తో ప్రభుత్వానికి కాపు కాస్తారా..?

స్థానిక ఎన్నిక‌లు ఈ నెలాఖ‌రులోగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన త‌రుణంలో రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారుకాకున్నా ముందుకు పోవ‌టానికే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌లో డ‌బ్బులు సారా పంచితే మూడేళ్ల బ‌హిష్క‌ర‌ణ  విదిస్తామంటూ  హెచ్చ‌రిక‌లు చేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా రిజ‌ర్వేష‌న్‌ల‌పై హైకోర్టు తీర్పుతో దిద్దుబాటు చర్య‌లు చేప‌ట్టింది. బిసిల రిజ‌ర్వేష‌న్‌తో పాటు కాపుల‌కు అండ‌గా నిల‌చేందుకు   కాపు నేస్తం పేరుతో ఓ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. దీని ప్ర‌కారం  45 – 60 ఏళ్ల మధ్య ఉన్న కాపు , తెలగ , ఒంటరి , బలిజ కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ . 15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ . 75 వేలను ఆర్థిక సాయంగా అందించాల‌ని నిర్ణ‌యించారు.
ఇప్ప‌టికే ఈ పథకానికి 2 . 29 లక్షల మంది అర్హులుగా గుర్తించినా, గ‌త కొంత కాలంగా పెండిగ్‌లో ఉంచారు. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ప‌థ‌కానికి   రూ . 1 , 101 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. దీంతో   ఈ నెలలోనే వీరి అకౌంట్లో తొలి విడత డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంద‌ని స‌మాచారం.

ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అందిస్తున్న అమ్మ ఒడి లో 15 వేలు, ఆటోడ్రైవ‌ర్ల‌కు 10 వేలు త‌దిత‌ర స్కీముల‌తో డ‌బ్బుల పంప‌కాలు ఆరంభించింద‌న్న ఆరోప‌ణ‌లు ఎన్ని ఉన్నా… కొంద‌రికైనా నేరుగా ఫ‌లితాలు అందుతున్నాయ‌న్న వాద‌న‌లూ ఉన్నాయి. ఇలా నేరుగా ప్ర‌జ‌ల‌కు ఉచితంగా కోట్ల కొల‌ది డ‌బ్బులు పంచే బ‌దులు వారికి ఉపాధి చూపేలా నిర్ధిష్ట కార్య‌క్ర‌మాలు, ఉపాధి మార్గాలు గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల‌కు అండ అందిస్తే, వారే స్వ‌యం ఉపాధి పొందుతూ నిల‌బ‌డ‌గ‌లుగుతార‌న్న సూచ‌న‌లు చాలానే వెల్లువ‌లా వినిపిస్తున్నా ప‌ట్టించుకునేదెవ‌ర‌న్న‌దే ప్ర‌శ్న‌.

అయితే తాజాగా కాపునేస్తం స్థానిక ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నం కోసం దాచి దాచి మ‌ళ్లీ తెర‌మీద‌కు తీసుకువ‌చ్చార‌న్న‌ది మ‌రికొంద‌రి వాద‌న‌. మ‌రి ఈ ఎన్నిక‌ల‌లో ఏక ప‌క్షంగా గెల‌వాల‌న్న‌ది జ‌గ‌న్ కాంక్ష‌. కానీ డ‌బ్బుల పంపిణీని అల‌వాటు చేసి, ఆపై మందు వ్య‌వ‌హారాల‌ను నడిపిస్తూ వ‌స్తున్న నేత‌లు తాజాగా విధించిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చేతులు క‌ట్టుకుని ఉంటారా? అన్న‌ది ప్ర‌శ్న‌. మ‌రి ఈ ప్ర‌శ్న‌కు జ‌వాబు స్థానిక ఎన్నిక‌ల‌లో నేత‌ల విన్యాసాలు చూస్తే కాని తెలియ‌దు. 

Leave a Reply

Your email address will not be published.