పోరాటాలు జరుగుతుంటే…. పవన్ ఎక్కడ?

రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసింత ఓపిక, నేర్పరితనం.. కలివిడి, కలుపుగోలుతనంతో పాటు ఓడినా గెలిచినా అను నిత్యం ప్రజల్లో ఉన్నప్పుడే వారికి ఆ నేతలపై నమ్మకం ఏర్పడుతుంది. గెలుపు బాటన పయనింప గలుగుతారు. కానీ ఈ లాజిక్ ను జనసేనాని పవన్ కళ్యాన్ మిస్ అవ్వుతున్నాడు కనుకనే వరుస ఎదురుదెబ్బలు తింటున్నాడని సొంత పార్టీ నేతలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ పరుష ప్రసంగాలను అభిమానులు ఆస్వాదిస్తున్నా… సభలకు హాజరైనంత మంది అభిమానుల ఓట్లు కూడా దక్కకుండా పోతున్నాయంటే…. పవన్ కు రాజకీయంగా ఎంత దెబ్బ పడుతోందో ఇట్టె చెప్పొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మొన్నటికి మొన్న అమరావతి రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా ముళ్లకంచెలు బద్దలు కొట్టి మరీ 9 కి.మీలు నడిచి వెళ్లిన పవన్ ఇక ఈ పోరాటాన్ని తన భుజాలపైకి ఎత్తుకుని ముందుకు సాగుతాడని, రైతాంగానికి దిశ దశ నిర్దేశిస్తాడని అంతా అనుకున్నారు. జనసేన కార్యకర్తలతో పాటు అమరావతి రైతులు కూడా జనసేనానిపై గంపెడాశలు పెట్టుకున్నా, అమరావతి లో హల్ చల్ చేసిన రోజు నాటి నుంచి పవన్ మళ్లీ ఇంత వరకూ ఏపీ రాజకీయ తెరపై కనిపించ లేదన్నది వాస్తవం. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి, మరో మారు రాజకీయ అమావాస్య చంద్రుడు అనిపించుకున్నారని, ఆతనికి పాలిటిక్స్ అంటే పార్ట్ టైం వ్యవహారంలా మారిపోయిందన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలను సందర్శించడం, అధికార పార్టీపై ఉవ్వెత్తున విమర్శలు చేస్తూ, ఎగిసిపడడం..
అభి మానులకు సత్తా చూపిద్దామని రంకెలేయటం, ఉద్వేగ ప్రసంగాలు చేయటం ఆతర్వాత కనిపించకుండా పోవడం ఇదీ పవన్ తతంగమని… తాజాగా అమరావతిలోనూ రైతుల నడుమ పాలి‘ట్రిక్స్’ ని పవన్ ప్రదర్శించాడని సెటైర్లు వినిపిస్తున్నాయి. దీంతో పార్ట్ టైం పాలిటిక్స్ తో తమ అధినేత పవన్ కళ్యాణ్ తమ సమయాన్ని కూడా హరిస్తున్నారని జనసైన్యంలో కూడా నైరాశ్యం కనిపిస్తోంది. ఆమధ్య ఎన్నికలకు ముందు 10 రోజులు విస్తృతంగా ప్రచారం చేసి ఇక గెలుపే తరువాయి అన్నట్టు అభిమానులతో సిఎం… సిఎం.. అని పిలిపించుకుంటూ వార్తల్లో నిలిచి పవన్ కళ్యాణ్… ప్రజా క్షేత్రంలో వేళ్లూరుకుంటామనుకున్న దశలో ఓ 15 రోజుల పాటు కనిపించకుండా పోయి రెస్టు తీసుకుంటుండటం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నది జనసైనికులలో కొందరి మాట.
పోనీ ఓటమిపైన సమీక్షించుకుంటూ ఈ ఓటమితో కృంగిపోనని చెప్పడం సహేతుకమే అయినా… మన టార్గెట్ ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు పాలిటిక్స్ లో ఉండి ఎప్పటికైనా అధికారమే లక్ష్యంగా పనిచేస్తానని పవన్ స్పష్టం చేయటం జనసైనికుల ఉత్సాహంపై ఉప్పెనలాంటి నీళ్లు చిలకరించినట్టు అయ్యింది. పార్టీ పెట్టిన నాటి నుంచి ఏపీలో ఏర్పడుతున్న సమస్యల పై స్పందించే తొలి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నప్పటికీ ఆయా సమస్యలపై ప్రభుత్వాలని నిలదీయటం….. ఆపై సైలెంట్ అయిపోవడం తరుచుగా కనిపిస్తుండటం జనసైనికులను నీరసపరుస్తోంది.
ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి రైతుల రాజధానికి మద్దతు ప్రకటించిన పవన్ వారితో కలిసి పోరాడతానంటూ చెప్పి వారాలు గడుస్తున్నా… ఎక్కడా కనిపించకుండా పోయారు. మూడు రాజధానులకు వ్యతిరేకమంటూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు సరికదా… పార్టీలోని వారికి కూడా ఎలాంటి సూచనలు చేయక పోవటం మళ్లీ సైలెంట్ అవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు. ఇలా పదే పదే చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను పోగొట్టుకుంటు జనంలో పలుచన అవుతున్నారన్న భావన ఆ పార్టీలోనే వినవస్తోంది. ఉవ్వెత్తున ఎగిసిపడడం.. మళ్లీ చప్పున చల్లారడం పవన్ కళ్యాణ్ కు అలవాటుగా మారిపోయిందని జనసైనికులూ లబోదిబో మంటుంటే పవన్ తన కొత్త చిత్ర కథా చర్చలలో ఉన్నారని కొందరంటుంటే, అన్న చిరంజీవి మూడు రాజధానులకు మద్దతుగా నిలుస్తున్నందునే పవన్ వెనక్కి తగ్గి ఉంటాడన్న అనుమానాలూ రేగుతున్నాయి. రాజకీయాలను పార్ట్ టైంగా చూసుకుంటే జనసేన నుంచి పలాయనాలు పెరిగే ఆస్కారం ఉందని సొంత పార్టీ నేతలే అధ్యక్షుడు పవన్ ని హెచ్చరిస్తుండటం గమనార్హం.