సుగాలి ప్రీతీ కేసును సిబిఐకి అప్పగించాలి : పవన్ కళ్యాణ్

కొందరు పోలీసు అధికారులు డబ్బుకి అమ్ముడు పోయి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుగాలి ప్రీతీ తల్లి ఆరోపించారు. సోమవారం కర్నూలులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడితే న్యాయం కోసం ఆశ్రయిస్తే మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ తమను చీప్ పీపుల్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని బోరున విలపించారు.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీ ఇలా అందరి దగ్గరికీ వెళ్లినా తమకి న్యాయం జరగలేదని..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా న్యాయం జరుగుతుందని మేం విశ్వస్తున్నామని అన్నారామె.
2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని దీనిపై కలెక్టర్ నేతృత్వంలో వేసిన కమిటీ లైంగిక దాడి చేసి..తమ బిడ్డని హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చిందని సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేసినా బెయిల్ వచ్చేసెక్షన్లు పెట్టడంతో 23 రోజులకే వారికి బెయిల్ వచ్చి తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో జరిగిన దిశా విషయంలో చూపిన చొరవ..ప్రీతీ విషయంలో ఎందుకు చూపలేదని నిలదీసారు. జగన్ ప్రభుత్వానికి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేందుకు కొంత గడువు ఇచ్చామని, అయినా విఫలమైందని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేసారు. న్యాయం కోసం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.
కాగా ఈ సుగాలి ప్రీతి కేసుపై కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతూ సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని . ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు.