గర్వం లేని నాయకుడి ఎమోషనల్ యాత్ర ఇది! – మహి.వి.రాఘవ్

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథలో పాదయాత్రలోని కీలక ఘట్టాలపై తెరకెక్కించిన సినిమా యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 8న సినిమా విడుదలవుతోంది. దర్శకుడు మహి వి.రాఘవ్ హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి..
యాత్ర.. ఎంపికకు కారణం?
వైయస్సార్ పై సినిమా చేయాలనేది నా ఉద్ధేశం కాదు. ఒక మనిషి కథను ఈ టైంలో చెప్పాలనేంత నైపుణ్యం కూడా నాకు లేదు. ఏడెనిమిదేళ్ల కాలంలో చాలా మంది వ్యక్తులను కలిసినప్పుడు, చూసినప్పుడు వారు చెప్పిన విషయాలన్ని వై.ఎస్.ఆర్ చుట్టూ తిరిగేవి. ఆనందోబ్రహ్మ సినిమా చేస్తున్నప్పుడు వై.ఎస్.ఆర్ పాత్ర గురించి మరింత ఆసక్తి ఏర్పడింది. నేను సాధారణంగా ఎక్కడికైనా వెళ్లేప్పుడు ఆయన గురించి ఎవరినైనా అడిగితే వాళ్లు ఆయన గురించి చాలా మంచిగా చెప్పేవారు. ఆయన ధైర్యసాహసాల గురించి ఎవరూ నాకు చెప్పలేదు. ఆయన వల్ల ఆరోగ్యశ్రీ వచ్చిందనో.. ఇంకేదో వచ్చిందనో చెప్పారు. ఓ రాజకీయ నాయకుడి గురించి ప్రజలు మంచిగా చెప్పుకోవడం చాలా అరుదైన విషయం. అలాంటి వ్యక్తి గురించి ఓ సినిమా చేయాలనిపించింది. ఆయన జీవితంలో పాదయాత్ర అనే పార్ట్ తీసుకున్నాను. పాదయాత్ర టైమ్‌లైన్‌కి, సినిమాటిక్ టైమ్‌లైన్‌కి చాలా తేడా ఉంటుంది. ఒక మంచి డ్రామా ను ఎమోషనల్ గా చూపించాను.
వైయస్ కుటుంబ సభ్యులను కలిశారా?
వై.ఎస్.ఆర్ పాదయాత్ర మీద సినిమా కాబట్టి వివాదాలకు తావివ్వకూడదు. అందుకే కథ జాగ్రత్తగా రాసుకున్నాను. ఈ సినిమాలో ఆయన జీవితం గురించి చెప్పదలుచుకోలేదు. ఆయన పాదయాత్ర ఘట్టాన్ని మాత్రమే చూపిస్తున్నా. జగన్ అన్నను.. పోస్టర్ రెడీ అయిన తర్వాత గోదావరి జిల్లాలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వెళ్లి కలిశాను. అప్పటికే చూశానని ఆయన తెలిపారు.
మమ్ముట్టి మీ తొలి ఆప్షనా? ఆయనే ఎందుకు?
ఈ సినిమాకి ఎవరు దర్శకత్వ ం వహించినా టాప్ 3 స్థానంలో మమ్ముట్టి పేరు పరిశీలించాల్సిందే. ఆయన అన్ని రకాల సినిమాలు చేశారు. ఓ డైరెక్టర్‌గా నేను మమ్ముట్టిని వైయస్‌లా చూపించాలనుకోలేదు. 2004లో వైయస్ శరీరభాష వేరు. దానినే పాత్రలో చూపించాలనుకోలేదు. హృదయానికి హత్తుకునే, ఒదిగి ఉండే పాత్రగా చూపించాలనుకున్నా.
నా తొలి చాయిస్ మమ్ముట్టి. ఆయన తెలుగు సినిమా చేసి చాలా కాలమైంది. ఈ పాత్ర చేయాలంటే తెలుగు చక్కగా మాట్లాడగలగాలి. కథ, పాత్ర వినగానే ఆయన నటించాలనుకున్నారు. ఈ సినిమాలో నేను ఎందుకు నటించాలి? అని అడిగారు. దళపతి సినిమాలో ఓ సీన్లో మీరు, రజనీకాంత్, అరవిందస్వామి ఉంటారు. అన్ని డైలాగ్స్ రజనీకాంత్‌కే ఉంటాయి. మీరు కేవలం కుదరదు అనే మాట చెప్పి ఆ స్క్రీన్ స్పేస్‌ను క్యారీ చేశారు. అలాంటి ఓ గర్వం లేని వ్యక్తి నాకు కావాలి అన్నాను. అలా అంగీకరించారు. మమ్ముట్టి ముఖంలో గర్వం కనిపించదు.
ఎన్నికల్లో ప్రజల్ని ప్రభవితం చేస్తున్నారా?
30- ఏళ్ల క్రితం అయితే ఇలాంటివి నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ఓటరు తెలివైన వారు. ఎవరికి ఓటేస్తే మాకేంటి అనే టైపు. సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేస్తే సూపర్‌స్టార్స్ అందరూ ముఖ్యమంత్రులైపోతారు. కానీ సినిమాలకు, రాజకీయాలకు చాలా తేడా ఉందని ప్రజలకు బాగా తెలుసు. దీని వల్ల రెండు, మూడు ఓట్లు కూడా రావనేది నా భావన.
ఎన్టీఆర్- మహానాయకుడితో పోటీ ఎందుకు?
నేను పెద్ద దర్శకుడిని కాను. పెద్ద సపోర్టు లేదు. మమ్ముట్టి మన పరిశ్రమ వ్యక్తి కాదు. అలాంటప్పుడు రెండు ఒకే తరహా సినిమాలు ఒకేసారి విడుదలైతే ఇలాంటి ఆసక్తికర ప్రచారం ఉంటుంది.
పాదయాత్ర ఘట్టాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
పాద యాత్ర ఘట్టంతో పాటు ఉపకథలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఎందుకు పెట్టారనే విషయాలను హత్తుకునేలా చూపించాం. పాదయాత్ర ముగించడంతో సినిమా ముగుస్తుంది.
వైయస్ పథకాలను చూపిస్తున్నారా?
అందుకు దారి తీసిన పరిస్థితులను టచ్ చేశాం. ఆరోగ్య శ్రీ పథకం పెట్టడానికి ఆయన బలమైన సందర్భ ం ఉంది. 2003 వరకు ప్రజలు వై.ఎస్.ఆర్ని చూసింది వేరుగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఆయన ప్రజలకు దగ్గరగా వెళ్లారో ఈయన ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని అర్థం చేసుకున్నారు. ప్రజలేం కావాలనుకున్నారో వైయస్ దగ్గరగా వెళ్లి చూశారు. వైయస్ పై నాకు తెలిసినవి.. తెలియనివి సేకరించి సినిమా తీశాను.
చంద్రబాబు పాత్ర ఉంటుందా?
ఒకరిని గొప్పగా చూపించడానికి మరొకరిని తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు. నా కథ ప్రకారం ఆయన పాత్రను చూపించే అవసరం రాలేదు.
వై.ఎస్.జగన్ పాత్ర గురించి?
వై.ఎస్.జగన్ పాత్ర సినిమాలో ఉండదు. ఆయన రియల్ విజువల్స్ మాత్రమే చూపించాం. అందులో జగన్ కనపడతారు. స్క్రిప్ట్‌లో రాశాం. కానీ చివరిలో వద్దనుకున్నాం. వై.ఎస్ పాత్రతో కనెక్టివిటీ మిస్సవ్వకుండా ఈ జాగ్రత్త తీసుకున్నాం. ఎమోషనల్ జర్నీ పోకూడదనే ఈ జాగ్రత్త.
జగన్ టీజర్ చూసి ఏమన్నారు?
టీజర్ బావుందన్నారు. సినిమా చూస్తారా సార్? అని అడిగితే మీ నాయకుడి కథ మీరు చెప్పారు అని అన్నారు. ఏం చేయాలో నేను చెబితే క్రియేటివిటీ దెబ్బ తింటుందని అన్నారు. వాళ్లే సినిమా తీయాలనుకుంటే నేను దర్శకుడిని అయ్యేవాడిని కాను. ఎవరో వాళ్ల కోణంలో వాళ్ల నాయకుడిని చూపించాలనుకుంటున్నారు అని వాళ్లు అనుకున్నారు.