సీఆర్డీఏ బిల్లు విషయంలో అయోమయం లో ప్రభుత్వం ?

  

అమరావతి ని రాజ‌ధానిని చేసిన త‌దుప‌రి గ‌త ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టం ని ర‌ద్దు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు స‌మాచారం.  ఇప్ప‌టికే ఈ విష‌యంపై ప్రభుత్వంలో అనేక తర్జన భర్జనలు జరుగుతున్నాయి. . సీఆర్డీఏ బిల్లు రద్దు చేస్తే..రైతులకు న్యాయపరంగా పోరాడే అవకాశం ఉంటుందనే భావ‌న లు పెరుగుతున్నందున రాజధాని విధుల వికేంద్రీకరణ దిశగా ప్రస్తుతం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో.. దీనిని ర‌ద్దు చేసిన‌ట్ట‌యితే ఆ ప్రభావం ఏమేర‌కు చూపిస్తుందనే అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  

సీఆర్డీఏ బిల్లు లో స‌వ‌ర‌ణ‌లు చేసి ద్రవ్య బిల్లుగా ప్రవేశ పెట్టాల‌ని తొలుత భావించినా… సాధారణ బిల్లుగా సభలో ప్రవేశ పెట్ట‌డ‌మో, లేదా పూర్తిగా ర‌ద్దు చేయ‌డ‌మా అనే విష‌యం పై  ఉన్నత స్థాయిలో సుదీర్ఘ చర్చలు సాగాయి.  దీంతో  సీఆర్డీఏ బిల్లు విషయంలో ప్రభుత్వ తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారి, అనేక చ‌ర్చ‌ల‌కు తావిచ్చింది. 

రాజధానిని విశాఖకు మార్చడం, మూడు రాజధానుల అంశం ఈ బిల్లులోనే పెడతారా లేక సీఆర్డీయే చట్టం సవరణకే పరిమితమవుతారా అన్నదానిపై స్పష్టత లేదు. శాసన మండలిలో టీడీపీకి భారీ మెజారిటీ ఉంది. మొత్తం 55మంది కౌన్సిల్‌ సభ్యుల్లో వైసీపీకి కేవలం తొమ్మిది మందే ఉన్నారు. టీడీపీతో పాటు పీడీఎఫ్‌, బీజేపీ కూడా రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాయి.  దీంతో సిఆర్‌డిఏ బిల్లు  మండ‌లిలో ఆమోదం పొందటం అంత సులువైన విషయం కాదని భావిస్తున్న ప్ర‌భుత్వం దీనిని నేరుగా ర‌ద్దు చేయ‌టం కోసం గ‌వ‌ర్న‌ర్‌కి పంపాల‌ని యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.  మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.
 

Leave a Reply

Your email address will not be published.