సిఎం జగన్‌ని తాకిన నిరసనల సెగ
మూడు రాజధానులంటూ అమరావతిలో ఉన్న పాలనా కేంద్రమైన సెక్రటేరియట్‌ని విశాఖకు తరలించాలని చూస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అమరావతి ప్రాంత రైతుల నిరసన సెగ గట్టిగానే తాకింది. మంగళవారం సిఎం జగన్ రాజధాని తరలింపు, స్థానిక ఎన్నికల ఏర్పాట్లు, తదితర అంశాలపై సచివాలయంకు వెళ్తున్న సిఎం జగన్ కాన్వాయ్ ని జనం అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకారులు తమ నిరసన తెలిపారు.
మరోవైపు సీఎం కాన్వాయ్ మందడం మీదుగా వెళుతున్న సమయంలోనూ గ్రామంలో మహిళలు జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ… ఆందోళనలు నిర్వహించగా మరికొందరు తమ ఇళ్ల వద్ద నిలబడి అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కనిపించారు.
పోలీసులు నిరసనకారులపై దాడి చేసి వారిని ఇళ్లలోకి తరిమేస్తుండటంతో మందడంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు సిఎం అమరావతి వస్తుండటంతో తెలుగుదేశం పార్టీతో సహా పలు పార్టీల నేతలను గృహనిర్భందంలో ఉంచారు. ఇళ్ల నుంచి ఎవరిని బయటకు రాకూదని ఆదేశాలిచ్చారు. అమరావతి పరిసరాలలో 144 సెక్షన్ విధించి, నిరసనలు అణచి వేసే ప్రయత్నాలు చేసినా… తన కాన్వాయ్ ఎదుట రైతులు నిరసనలు కనిపించడం పై సిఎం జగన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.