ఈరోజు కోర్ట్ లో హాజరు కానున్న జగన్

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. గత మార్చి 1న చివరిసారిగా ఆయన న్యాయస్థానంలో హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి ప్రతి వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వస్తున్నారు. అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరు కావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి గత వారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు ఆయన, రెండో నిందితుడైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పనిసరిగా హాజరై తీరాలని.. లేదంటే తగు ఉత్తర్వులు జారీ చేస్తానని హెచ్చరించారు.
జగన్ కోర్టుకు రానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో సీబీఐ కోర్టు వద్ద తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.