లంబసింగి అందాలు… చూడాలని ఉందా !

నులివెచ్చని సూర్యకిరణాలు తాకుతుండగా, ప్రకృతి అందాలను చూసి పులకరించాలనుకునే యాత్రికులు, ప్రకృతి ప్రేమికులు అరకులోయ అందాలను వీక్షించాలని, లంబసింగి మంచుతెరల్లో తేలియాడాలని అనుకుంటారు. అందునా శీతాకాలం పర్యాటకుల హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా దీనినే దృష్టిలో పెట్టుకున్న ఎపీఎస్ ఆర్టీసీ తన ఆక్యుపెన్సీ రేటును పెంచుకునేందుకు, సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు టూరిజంపై దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను అనుసరిస్తూ ముందుకు పోతున్న ఆర్టీసి పండగల సీజన్ లో ప్రత్యేక సర్వీసులను నడపడం, సెలవుల్లో ఎంపిక చేసిన టూరిస్ట్ ప్రదేశాలకు కొత్త సర్వీసులు వేయడం లాంటి ప్రయోగాలు చేస్తుండటంతో ఆర్ధికంగా ఆర్టీసి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.
ఈక్రమంలోనే ఏపీఎస్ ఆర్టీసీ విశాఖ రీజియన్ అరకు లోయ, లంబసింగి అందాలను వీక్షించే పర్యాటకుల కోసం పర్యాటక శాఖ ప్యాకేజికి ధీటుగా ప్రత్యేక సర్వీసుల్ని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం విశాఖ రీజియన్ ఆర్టీసీ ఉన్నతాధికారులు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసారు. లంబసింగికి వెళ్లే సర్వీసులు ద్వారకా బస్ స్టేషన్ లో తెల్లవారుజామున మూడు గంటలకే బయలుదేరే ఈ ప్రత్యేక సర్వీసులు యాత్రికులను లంబసింగికి తీసుకెళ్లున్నాయి. లంబసింగికి వెళ్లే సర్వీసులు మార్గమధ్యంలో ఉన్న కొత్తపల్లి వాటల్ ఫాల్స్, మోదమాంబ ఆలయం, మత్స్యగుండంలో ఉన్న కాఫీ ప్లాంటేషన్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాయి.
అలాగే అరకు వెళ్లే ప్రత్యేక సర్వీసులు దమకు వ్యూ పాయింట్, బొర్రా గుహలు, గాలి కొండ వ్యూ పాయింట్, ట్రైబల్ మ్యూజియమ్ , చాపరై వాటర్ ఫాల్స్, పద్మపురం గార్డెన్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అరకు, లంబసింగిలలో అరుదైన అనుభూతిని ఆస్వాదించేందుకు యాత్రికులు ఇప్పుడు పోటీలు పడుతున్నారని, అడ్వాన్స్ బుకింగ్‌లో జోరు పెరిగిందని వివరించారు. రద్దీ విపరీతంగా ఉండడంతో ఆర్ధికంగా పెద్ద మొత్తాలు వచ్చి పడుతుండటంపై సంతోషం వ్యక్తంచేసారు.
అలాగే లంబసింగి నుంచి అరకు వ్యాలీ అంతా చుట్టివచ్చేలా ఏర్పాటు చేసిన ఈ సర్వీసుల పై చేస్తున్న విస్తృతం ప్రచారంతో టూరిస్టుల రష్ పెరుగుతోందని విశాఖ రీజియన్ మేనేజర్ చెప్పారు. నెలరోజులుగా ఈ సర్వీసులకు వచ్చిన రెస్పాన్స్ బాగుందని, ప్రస్తుతం ఆర్టీసీ విశాఖనుంచి లంబసింగికి అల్ట్రా డీలక్స్ సర్వీసుల్ని నడుపుతున్నామని చెప్పారు.
వారాంతాల్లో విశాఖ ఏజెన్సీ అందాలను చూసి ఆనందించాలనుకునే యాత్రికుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడంతో అధునాతన సౌకర్యాలతో కూడిన హైటెక్ బస్సుల్నికూడా ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. వీటితో పాటు విజయనగరం, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలలో ఉన్న ప్రకృతి అందాలనుచూపేందుకు విశాఖ రీజియన్ ఆర్టీసీ ఉన్నతాధికారులు మరికొన్ని సర్వీసులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.