స్వీప్ చెయ్యక పోతే పరిస్థితి.? మంత్రుల టెన్షన్ టెన్షన్

ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండటంతో తెలంగాణ మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పోరేషన్లలో తమ పార్టీ స్వీప్ చేస్తుందని టీఆర్ఎస్ నాయకులు విశ్వాసంతో ఉన్నప్పటికి పొరపాటున విజయం వరించకుంటే పరిస్థితేంటన్న ఆందోళన మంత్రులలో కనిపిస్తోంది. కనీసంగా ఏడు జిల్లాల్లో తెరాస మంత్రుల వ్యవహార శైలిపై మండిపడుతున్న వారే రెబల్స్‌గా రంగంలోకి దిగటంతో వారికి ఎదురు గాలి వీస్తున్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన మంత్రులు కూడా వీరిలో ఉన్నారని, అలాగే కొత్తగా మంత్రివర్గంలో చేరిన మంత్రులకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారే ఆస్కారం కనిపిస్తోంది.
పూర్తి మెజారిటీలను అందుకోకుంటే వేటు తప్పదని ఇప్పటికే కేసీఆర్ మంత్రులకు హుకుం జారీ చేసిన పక్షంలో బాగా ధనం, మద్యం ఏరులై పారించడంతో కొంత మంది మంత్రుల సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులను గెలిచే అవకాశాలున్నాయని అయితే జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పటికే వారిని నిద్రపట్టనీయటం లేదట. 25న ఫలితాలు వెలువడ నున్న తరుణంలో అభ్యర్ధల కన్నా మంత్రులే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. కొన్ని చోట్ల మెజారిటీ వార్డులు గెలుచుకునే అవకాశం టీఆర్ఎస్ కు లేదని, కేవలం నామినేటెడ్ సభ్యుల ద్వారా చైర్ పర్సన్ పదవులను దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ తరహా విజయాన్ని కేసీఆర్ అంగీకరించరని, కచ్చితంగా కొందరు మంత్రులకు గండం తప్పదని పార్టీలోని ఓవర్గం అంటోంది.