వ్యవసాయ పనుల నుంచి రైతు రిటైర్

ఉద్యోగం చేసే ఏ ఒక్కరికైనా రిటైర్మెంట్ తప్పదు. అదీ ప్రభుత్వంలో అయినా, ప్రయివేటు సంస్ధలోనైనా పదవీ విరమణ తప్పదు. అయితే వ్యవసాయం చేస్తూ, జనానికి అన్నం పెట్టే రైతన్నలు విశ్రాంతి తీసుకోవటం అనేదే దాదాపు జరగదు. నేలతల్లిని నమ్ముకున్న రైతుకి సెలవంటూ ఉండకున్నా, ఈ మధ్య ప్రభుత్వాల నిర్వాకాల కారణంగా పంట సెలవులు ఎక్కడికక్కడ ప్రకటిస్తున్నారు రైతాంగం.
కాగా మహారాష్ట్రలోని ఓ రైతు తనకు 80 ఏళ్లు రావటంతో ఇక పండించే బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే… మహారాష్ట్రలోని భండారా జిల్లాలోని మోహ్గావ్కు చెందిన రైతు గజానన్ కాలే(80) వ్యవసాయం చేయలేనంటూ రిటైర్మెంట్ ప్రకటించుకున్నాడు. 60 ఏళ్ల పాటు వ్యవసాయం చేసిన కాలే ఇకపై వ్యవసాయ పనులు చేయడని కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు.
ఈ క్రమంలోనే గజానన్ కాలే రిటైర్మెంట్ ను గ్రామంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఊరందరినీ పిలచి పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలేతో పాటు మరి 10 మంది రైతులను సన్మానించి, వారినందరినీ ఎడ్లబండీలో గ్రామంలోని అన్ని వీధులూ ఊరేగించడం విశేషం.
గజానన్ సోదరుడు యశ్వంత్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబంలో మొత్తం 19 మంది సభ్యులం కలసి ఉంటున్నామని చెప్పారు. ఇన్నాళ్లూ గజానన్ తనకు ఉన్న 25 ఎకరాల పొలంలో నిర్విరామంగా పనిచేసి, కుటుంబానికి అండగా నిలచారని, ఇప్పుడు అన్నయ్యకు వయసు పెరుగుతున్నందున అతనికి వ్యవసాయ పనుల నుంచి విముక్తి కల్పించాలని కుటుంబసభ్యలమంతా కలసి నిర్ణయించి, రిటైర్ కావాలని అభ్యర్ధించామని. ముందు కాదని అన్నా, ఆరోగ్యరీత్యా అంగీకరించినట్టు చెప్పారు. అన్నయ్య రిటైర్ అయినా వ్యవసాయబాగోగులపై అన్నిరకాలుగా సలహాలు సూచనలిస్తాయని చెప్పారు.