జైళ్ళలో ఉన్న ఖైదీలకు కూడా కరోనా వైరస్

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా వైరస్ కు ఆది మూల‌మైన చైనాలో విజృంభిస్తోంది. వేల‌సంఖ్య‌లో జ‌నం ఆసుప‌త్రుల పాల‌వుతు, ఇప్ప‌టికే  ప్రపంచ వ్యాప్తంగా 2247గా ఉంది. వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 76,700కు చేరిన క్ర‌మంలో  ఆ దేశంలోని జైళ్ళకు కూడా ఈ వైర‌స్ పాకిన‌ట్టు అధికారులు చెపుతున్నారు.  దేశంలోని వివిధ ప్రాంతాల్లోని జైళ్ళలో ఉన్న ఖైదీలకు ప‌రీక్ష‌లు చేయ‌గా 500 మందికి పైగా ఈ వైరస్ సోకిన వారున్నార‌ని వైద్యులు నిర్ధారించార‌ని  చైనా అధికారిక వ‌ర్గాల స‌మాచారం. దీనికి తోడు శుక్ర‌వారం ఒక్క‌రోజే  చైనాలో కొత్తగా 889 కరోనా కేసులు నమోదు కావ‌టంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న క‌లుగుతోంది. 

ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైరస్‌కు కేంద్ర స్థానంగా ఉన్న వుహాన్ నగరంలో పరిస్థితి రోజు రోజుకీ దిగ‌జారుతోంది. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా, ప్ర‌త్యేక ఆసుప‌త్రి నిర్మాణం జ‌రిపి, వైద్యం అందిస్తున్నా ప‌రిస్థితి మరింత భయానకరంగా ఉంది. ఈ వైరస్ బారినపడిన రోగులకు చికిత్స చేస్తున్న వైద్యుడొక‌రు తాజాగా  మ‌ర‌ణించిన‌ట్టు వార్త‌లు ఆందోళ‌న క‌లిగించాయి. క్ర‌మంగా మృతుల సంఖ్య పెరుగుతుండ‌టం, ఇత‌ర దేశాల‌కు వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామ‌నుకునే వారికి వీసాలు జారీ కాక‌పోవ‌టంతో చేసేది లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు ఇక్క‌డి జ‌నం.

 ఇకపోతే, చైనా తర్వాత జ‌పాన్‌లో అత్యధిక కొవిడ్‌-19 కేసులు న‌మోదు కావ‌టం విశేషం.   ఇరాన్‌లోఇప్ప‌టికే కొవిడ్‌-19 కారణంగా ఇద్దరు చనిపోయార‌ని అధికారికంగా ప్ర‌క‌టించ‌గా,  దక్షిణ కొరియా త‌మ దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య 204కు చేరింద‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది.   చైనా లో ఉపాధి కోసం వెళ్లి తిరిగి  స్వదేశానికి తరలివచ్చిన 45 మంది ఉక్రెయిన్‌ వాసులను  దేశంలోకి రానివ్వొద్దంటూ పలువురు ఆందోళనలకు దిగ‌టంతో ఉక్రెయిన్‌వారిని ప‌రీక్ష‌లు చేయించేందుకు ప్ర‌త్యేక విమానంలో త‌ర‌లించ‌డం విశేషం. 

కాగా  కరోనా వైరస్‌ నివారణకు మందులు క‌నిపెట్టామంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల వైద్యులు ప్ర‌క‌టిస్తున్నా, అవి తాత్కాలిక ఉప‌శ‌మ‌నాలేన‌ని, దీని నివార‌ణ‌కు గల అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. పరిస్థితి చేయిదాటిపోక ముందే ప్రపంచం మేలుకోవాలని  అంతర్జాతీయ సమాజం  కలిసిరాకుంటే పరిణామాలు  మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదని హెచ్చ‌రించింది.
 

Leave a Reply

Your email address will not be published.