పెన్షన్ల పంపిణీలో కొత్త అధ్యాయం


*నవరత్నాల అమలులో మరో ముందడుగు*

*తొలిరోజు (రాత్రి 8 గంటల వరకు) 41.87 లక్షల మందికి పెన్షన్ల చెల్లింపు*

*76.59 శాతం మందికి అందిన పెన్షన్*

*మొత్తం రూ.996.79 కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం*

*ఇంటి వద్ద లబ్ధిదారుల చేతికి పెన్షన్ మొత్తాలు*

*వాలంటీర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు భాగస్వామ్యం*

*వృద్ధులు, దివ్యాంగులు, పలు వ్యాధిగ్రస్తులకు తప్పిన పెన్షన్ కష్టాలు*

*ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటికే వచ్చిన పెన్షన్ డబ్బులు*

*సీఎం శ్రీ వైఎస్ జగన్ చిత్తశుద్దికి కృతజ్ఞతలు తెలిపిన పండుటాకులు*

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల అమలులో మరో ముందడుగు పడింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా (శనివారం సాయంత్రం 8 గంటల వరకు) 76.59 శాతం మందికి పెన్షన్లను వారి ఇళ్లకు వెళ్లి మరీ లబ్దిదారుల చేతికి అందించడం ద్వారా సరికొత్త సంక్షేమ విప్లవానికి నాంధి పలికింది. వాలెంటీర్ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి వరకు ఈ పవిత్రమైన కార్యక్రమంలో మేము సైతం అంటూ భాగస్వాములు కావడం విశేషం.
రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నిర్థిష్ట వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల ప్రారంభం రోజునే ప్రభుత్వం నుంచి అందాల్సిన పెన్షన్ నేరుగా వారి చేతికి అందాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. గతంలో మాదిరిగా పెన్షన్ల కోసం లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని ఆదేశించారు. నేరుగా లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్ లను పంపిణీ చేయాలంటూ సీఎం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఇళ్లకే వెళ్ళి అందచేశారు. జీవిత చరమాంకంలో వున్న వృద్ధులు, దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మంచం పట్టిన వ్యాధిగ్రస్తులు, కనీసం కదలేని స్థితిలో వున్న దివ్యాంగులు… తమ పెన్షన్ ను అందకోవడం నెలనెలా ఓ ప్రహాసనంగా మారిన పరిస్థితి నుంచి వారికి విముక్తి కలిగించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నేరుగా ఒకటో తేదీనే వారి ఇళ్లకు వాలంటీర్లు పెన్షన్లను అందచేయడం ద్వారా మానవత్వం వున్న పాలకుడిగా ముఖ్యమంత్రి మరోసారి ఆయా వర్గాల గుండెల్లో నిలిచిపోయారు.

*రికార్డు స్థాయిలో ఒకేరోజు రూ.996.79 కోట్లు పంపిణీ*
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం (సాయంత్రం 8 గంటల వరకు) పదమూడు జిల్లాల పరిధిలో 996.79 కోట్ల రూపాయల పెన్షన్లను పంపిణీ చేశారు. మొత్తం 41,87,919 మంది లబ్దిదారులకు నేరుగా వారి చేతికే పెన్షన్లను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54.68 మంది పెన్షన్ లబ్ధిదారులు వున్నారు. వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఒకేరోజు మొత్తం లబ్దిదారులకు పెన్షన్ చేరాలనే ప్రయత్నంలో భాగంగా తొలిరోజే 75.47 శాతం మొత్తాన్ని పంపిణీ చేశారు.  శనివారం ఉదయం నుంచే గ్రామాలు, వార్డులలో ఇంటింటికీ వెళ్ళిన వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు లబ్ధిదారులకు నేరుగా పింఛను అందచేశారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పేరుతో బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించిన ప్రభుత్వం, లబ్ధిదారులకు చెల్లించే పింఛను మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేయడం ద్వారా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వీలు కల్పించింది. పింఛన్ల చెల్లింపు కోసం ప్రతి వాలంటీరుకు స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చారు. ఆ ఫోన్లలో బయోమెట్రిక్‌ ఆధారంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను నిర్వహించారు. ఎక్కడైనా బయోమెట్రిక్‌ సమస్య ఉత్పన్నమైతే, సరిచేసి మర్నాటికల్లా పింఛను చెల్లిస్తారు. పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం రూ.15,675.20 కోట్లు కేటాయించగా, శనివారం నాటి చెల్లింపుల కోసం రూ.1,320.14 కోట్లు విడుదల చేశారు.

*నవరత్నాల హామీల్లో పెన్షన్లకు పెద్దపీట వేసిన ప్రభుత్వం: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*

రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అర్హులైన వారికి ఒకేరోజు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను పంపిణీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నవరత్నాల హామీల్లో ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’కు పెద్దపీట వేసిందని తెలిపారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా చూసిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్ల పంపిణీని పకడ్బందీగా అమలు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.   ఎన్నికల్లో నవరత్నాల పేరతో ఇచ్చిన హామీల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.  అందుకే ఈ ఏడాది ఏకంగా  పెన్షన్ల కోసం రూ.15,675 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా ఈ ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటుకుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా రాజీ లేకుండా, సంతృప్తికర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను అందించేలా చర్యలు చేపట్టారని అన్నారు. ఆరు నెలల క్రితం వరకు కేవలం రూ.1000 మాత్రమే ఉన్న పింఛనును రూ.2,250 చేయడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా 41.87 లక్షల మందికి ఒకేరోజు  పింఛను ను అందచేశామని, అది కూడా నేరుగా ఇంటికే వచ్చి ఆ పింఛను చెల్లించడం తమ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు.

*పెన్షన్ల చెల్లింపుల్లోనూ చంద్రబాబు సర్కార్ చిన్నచూపు*
గత చంద్రబాబు ప్రభుత్వంలో అయిదేళ్లలో ఏడాదికి గరిష్టంగా పెన్షన్ల కోసం కేటాయించిన మొత్తం రూ. 8,234.64 కోట్లు మాత్రమే. అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల చెల్లింపు కోసం అధికారం చేపట్టిన తొలి ఏడాది అంటే 2014–15లో రూ.3378.46 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత 2015–16లో రూ.5221.73 కోట్లు, 2016–17లో రూ.5270.12 కోట్లు, 2017–18లో రూ.5436.94 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల ఏడాది కావడంతో 2018–19లో పింఛన్ల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.8234.64 కోట్లు కేటాయించింది. అధికారం చేపడితే పింఛను మొత్తం రూ.1000 నుంచి రూ.2 వేలు చేయడంతో పాటు, ఏటా రూ.250 పెంచుకుంటూ పోయి నాలుగేళ్లలో మొత్తం రూ.3 వేల పెన్షన్‌ చెల్లిస్తామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించడంతో, గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా రూ.2 వేల చొప్పున పింఛను చెల్లించింది. అందుకే ఎన్నికల ఏడాదిలో మాత్రం రూ.8 వేల కోట్లకు పైగా కేటాయించింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన రోజు సుమారు ఇరవై అయిదు శాతం కూడా లబ్దిదారుల చేతుల్లోకి వెళ్లక పోవడం పెన్షన్లపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.

శనివారం (సాయంత్రం 8 గంటల వరకు) జిల్లాల వారీగా పంపిణీ చేసిన పెన్షన్ల వివరాలు:
——————————————————————————————————-
జిల్లా మొత్తం పెన్షన్లు అందుకున్న వారు చెల్లించిన మొత్తం రూ. శాతం
——————————————————————————————————-
కడప 3,10,590 2,67,401 63,43,80,000 85.51
శ్రీకాకుళం 3,43,758 2,95,859 69,65,92,250 85.07
నెల్లూరు 3,15,757 2,69,125 63,96,08,250 84.50
కర్నూలు 3,86,981 3,22,421 77,07,52,250 82.71
ప.గో జిల్లా 4,46,790 3,67,308 87,01,52,500 81.54
విజయనగరం 3,02,734 2,41,146 57,20,97,250 79.29
ప్రకాశం 3,80,989 2,97,954 70,58,07,750 77.68
చిత్తూరు 4,65,184 3,52,911 82,65,88,000 75.28
అనంతపురం 4,70,881 3,56,899 85,58,69,750 75.18
తూ.గో జిల్లా 6,02,390 4,35,565 102,65,23,750 71.67
గుంటూరు 5,10,086 3,65,731 85,97,92,500 71.28
కృష్ణ 4,51,517 3,30,824 78,42,25,000 72.65
విశాఖ 4,06,388 2,38,878 56,50,95,250 58.23
ఆర్ట్ పెన్షన్స్ 31,829 31,829 7,16,15,250 100
డిఎంహెచ్ఓ 31,672 9,882 4,69,70,250 29.96
డయాలసిస్ పెన్షన్లు (ప్రభుత్వ ఆసుప్రతులు)
4,186 4,186 4,18,60,000 100
డయాలసిస్ పెన్షన్లు (అఫ్లియేటెడ్ ఆసుప్రతులు):
6,577 0 0 0
—————————————————————————————————-
మొత్తం 54,68,309 41,87,919 996,79,30,000 75.47
—————————————————————————————————-

Leave a Reply

Your email address will not be published.