మరో దారుణ మోసం

తానో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ను అని నమ్మించాడు. మొదట స్నేహం అన్నాడు. తర్వాత ప్రేమ అన్నాడు. నెమ్మదిగా పరిచయం పెంచుకున్నాడు.అమ్మాయి వివరాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకున్నాడు.తేనేపూసిన కత్తిలా తీయని మాయ మాటలు చెప్పి ఆమె చిరునామా తెలుసుకున్నాడు.
బయట కలవటం నాకిష్టం ఉండదు..ఇంటికి వచ్చి కలుస్తాను అని మర్యాదస్తుడిలా మాట్లాడాడు.ఒకరోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎవరూ లేని సమయం తెలుసుకుని ఇంటికి వచ్చాడు.ఎవరూ రారని నిర్థారించుకున్నాడు. నెమ్మదిగా మాటల్లో దించాడు. అప్పటికే జేబులో సిద్ధం చేసుకున్న మత్తుమందు కలిపిన చాక్లెట్‌ తీసిచ్చాడు. అది తిన్న ఆ యువతి నెమ్మదిగా సోఫాలో మాట్లాడుతూ మగతగా తలవాల్చేసింది.  వెంటనే అతనిలో మృగాడు నిద్ర లేచాడు.  క్షణం కూడా ఆలస్యం చేయకుండా,   వడివడిగా వంటింటిలోకి నడిచి తన వెంట తెచ్చుకున్న సంచీ నిండా ఉల్లిపాయలు సర్దేసుకున్నాడు.అది చాలదన్నట్టు బీరువా తాళాలు పగలకొట్టి లోపల దాచిపెట్టిన ఉల్లిపాయలు కూడా సంచీలో కుక్కుకుని పారిపోయాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ యువతి, ఆమె బంధువులు బార్లా తీసున్న ఫ్రిజ్‌ తలుపులు, బీరువా తలుపులు చూసి బోరుమన్నారు…
దుండగుడిపై “ఉల్లి” చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.


భవిష్యత్తులో మనం చదవబోయే వార్తలు ఇవే. 
ఉల్లో రక్షతి రక్షితః.
ఉల్లాం-ఉల్లిపాయనమః

Leave a Reply

Your email address will not be published.