బాబు విశాఖ పర్యటనకు గంటా దూరం

పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం విమానాశ్రయంలో అడ్డగించి, నానా యాగీ జరుగుతున్నా…అక్కడ రణరంగం పరిస్థితులు ఏర్పడినా విశాఖపట్నం నార్త్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఎక్కడా కనిపించకపోవటం చర్చనీయాంశమవుతోంది.
గత కొంత కాలంగా టిడిపితో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న గంటా, మూడు రాజధానులను ఏర్పాటు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మారుస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ని స్వాగతించడం, స్ధానిక పార్టీ నేతలు, శాసనసభ్యులతో ప్రత్యేక సమావేశం పెట్టి మద్దతు పలకటం టిడిపికి వ్యతిరేకంగానే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కొంత కాలం ఆయన వైసిపిలోకి వెళ్తారని, మరికొన్నాళ్లు కమలం కండువా కప్పుకుంటారని ఇలా చాలా కథనాలు వినిపించినా, ఇటీవల వైసిపికి చెందిన ఇద్దరు ముగ్గురిని టిడిపిలోకి రప్పించి, పసుపు కండువా కప్పినప్పుడు నేను టిడిపిలోనే ఉంటానని తేల్చి చెప్పారు.
అయితే తాజా పరిణామాల క్రమంలో విశాఖపట్నంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం తప్పు పట్టడంతో ఆయన పార్టీలో ఇమడలకపోతున్నారనే వార్తలు మరోమారు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పర్యటనకు హాజరైతే విశాఖరాజధానిని తను వ్యతిరేకించినట్టు సంకేతాలందుతాయని, అది రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగిస్తుందనే ఆయన బాబు పర్యటనకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది.