ఓ క్వార్టర్ మందు వాట‌ర్ బాటిల్ తెస్తేనే దిగి వ‌స్తా….


మధ్యం మ‌త్తులో ఓ మందుబాబు క‌రెంటు స్తంభ‌మెక్కి పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌టం విశేషం. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే…
సికింద్రాబాద్‌లో ఓ మందుబాబు 30 అడగుల ఎత్తైన కరెంట్ పోల్ ఎక్కిన విష‌యాన్ని స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న మ‌హంకాళి పోలీస్ స్టేష్ సిబ్బంది, ఇత‌ర స్టేష‌న్ల‌కి కూడా క‌బురు పెట్టి పెద్ద ఎత్తున పోలీసులను త‌ర‌లించారు. పైగా  అంత ఎత్తు నుంచి కిందపడితే చనిపోయే ప్రమాదం ఉండటంతో   పోల్ చుట్టూ పరదాలు, నెట్లు ఏర్పాటు చేసి, ప‌డినా ప్రమాదం లేకుండా చేసారు. 

అయితే ప‌దే ప‌దే కింద‌కు దిగాలంటూ మైకులో విజ్ఞ‌ప్తి చేసినా ప‌ట్టించుకోని ఆ మందుబాబు కోరికేంట‌ని ప్ర‌శ్నిస్తే ఆత‌ని జ‌వాబు విని అవాక్క‌వ్వ‌టం పోలీసుల వంతైంది. ఇంత‌కీ ఆయ‌న గారు అడిగిందేంటంటే ఓ క్వార్టర్ మందు బాటిల్, వాట‌ర్ బాటిల్ తెస్తేనే దిగి వ‌స్తాన‌ని తేల్చి చెప్పడం విశేషం. అప్ప‌టికే భారీగా జ‌నం పోగ‌వుతుండ‌టం, పొర‌పాటున దూకి, ఏమైనా జ‌రిగితే త‌మ‌కు అక్షింత‌లు త‌ప్ప‌వ‌ని భావించిన పోలీసులు  చేసేది లేక క్వార్టర్ మందు, వాటర్ బాటిల్ తినేందుకు ఇత‌ర‌త్రాలు తీసుకొచ్చారు.

తాము తీసుకువ‌చ్చిన‌వ‌న్నీ కరెంటు పోల్‌పై ఉన్న ఆ మందుబాబుకు చూపెట్ట‌గానే, మ‌రో మెలిక పెట్టాడు. త‌ను కిందకు దిగాక తనను ఏమీ అన్నా, తిరిగి పోల్ ఎక్కేస్తాన‌ని బెదిరించాడు. ఇలా గంట పాటు పోలీసులకు అతను చుక్కలు చూపించాడు. చివరకు పోలీసుల బుజ్జగింపులతో ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చాడు.  సికింద్రా బాద్ శివార్ల‌లో ఉంటున్న ఇలియాస్  గా ఆత‌నిని గుర్తించిన పోలీసులు, మద్యం మత్తులోనే అతను పోల్ ఎక్కినట్టు  మీడియాకు చెప్పుకొచ్చారు. అనంత‌రం ఇలియాస్‌ని ఆత‌ని ఇంటికి పంపేసామ‌ని తెలిపారు. అదండీ విష‌యం. 

Leave a Reply

Your email address will not be published.