రాహుల్ గాంధీ బయోపిక్ ఓ కుట్ర

కాంగ్రెస్ అధ్యక్షుడు.. యువరాజా రాహుల్ గాంధీపై కుట్ర జరిగిందా? ఆయనపై బయోపిక్ తెరకెక్కించడం వెనక ఏం జరుగుతోంది? ప్రస్తుతం బాలీవుడ్ సహా ఉత్తరాది యావత్తూ జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. మై నేమ్ ఈజ్ రాగ పేరుతో కామసూత్ర 3డి ఫేం రూపేష్ పాల్ తెరకెక్కిస్తున్న తాజా బయోపిక్ సంచలనాలకు తావిస్తోంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. అయితే ట్రైలర్ ఆద్యంతం నాశిరకం విజువల్స్ తో చుట్టేశారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధినాయకుడి ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది అంటూ పలువురు తీవ్ర విమర్శల్ని గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీపై కుట్ర జరిగింది. ఈ కుట్ర చేస్తున్నది భాజపానే.. భాజపా నాయకులే ఈ బయోపిక్ వెనక ఉండి కథ నడిపిస్తున్నారు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దర్శకుడు రూపేష్ వెర్షన్ వేరొకలా ఉంది. ఒక జర్నలిస్టుగా నేను రాహుల్ గాంధీని చాలా దగ్గరగా చూశాను. దిల్లీలో పని చేస్తున్నప్పుడు ఆయనను చూసి స్ఫూర్తి పొందాను. రాహుల్ చుట్టూ ఉన్న నెగెటివిటీ, కాన్స్పిరసీని స్వయంగా చూశాను. అతడిని ఎవరూ నమ్మలేదు. ఆయన ఇలా కంబ్యాక్ అవుతాడని ఎవరూ భావించలేదు. రాహుల్ ని మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికల ముందు వరకూ అదే సన్నివేశం. కానీ ఆయన ఎన్నికల్లో గెలిచాక మాత్రం జనం చుట్టూ మూగారు అని అన్నారు. ఈ సినిమాని ఓ పొలిటికల్ ఎజెండాతో పొలిటికల్ ప్రొపగండాతో తీయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకి పెట్టుబడులు పెట్టింది ఎవరు? అని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ తప్ప ఇతర పార్టీల నాయకులు ఈ సినిమాకి పెట్టుబడులు సమకూర్చారని తెలిపారు. అందులో కొందరు భాజపా నాయకులు ఉన్నారని వెల్లడించడంతో రకరకాల సందేహాలు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ట్రైలర్ లో ఇందిరా గాంధీ హత్య సమయంలో రాహుల్ నాయనమ్మతోనే ఉన్నారు. ఆ హత్య తనని ఎలా వెంటాడింది? ఆ తర్వాత రాహుల్ లోని అంతర్మధనం ఎలా సాగింది? మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు పార్టీ యువరాజాగా బాధ్యతలు స్వీకరించాక రాహుల్ ఎలా మారారు? వంటి విషయాల్ని ట్రైలర్ లో చూపించారు. అయితే ఇందులో యథార్థాల్ని చూపిస్తున్నారా? లేక యువరాజాని నెగెటివ్ గా చూపిస్తున్నారా? అన్నది కాస్త వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.