ఇట్లు అమ్మ టైటిల్ లోగో లాంచ్‌

 తెలుగు చిత్ర పరిశ్రమకు అంకురం చిత్రంతో జాతీయ పురస్కారం అందించిన దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు రూపొందిస్తున్న తాజా చిత్రం ఇట్లు అమ్మ. మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అనేది ఈ చిత్ర ఉపశీర్షిక. చెడుమార్గంలో పయణిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని  ఇవ్వ‌టంతో పాటు  మంచి సమాజాన్ని నిర్మించేందుకు ప్రపంచంలోని అమ్మలంతా ఒక్కటవ్వాలనే పిలుపునిచ్చే సినిమా ఇది.

 బొమ్మక్ క్రియేషన్స్ పతాకంపై బొమ్మక్ మురళి నిర్మించిన ఈ సందేశాత్మ‌క చిత్ర  టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం సోమ‌వారం మ‌ధ్యాహ్నం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

లోగోను ఆవిష్కరించిన అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ..అంకురం సినిమా చూసి ఆ దర్శకుడు బాలచందర్ అనుకున్నా. అంత‌లా హృద‌యాన్ని తాకింది అంకురం    ఉమామహేశ్వరరావు  సమాజం కోసం కథలు రాసే వ్య‌క్తి.   సమాజం బాగుండాలని, వ్యవస్థలతో పోరాడుతూ అందులో భాగంగా సినిమాలు చేస్తున్నారు. నిర్మాత బొమ్మక్ మురళి ఒక అంకితభావంతో ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది.  మీరు అనుకున్న ప్రభావం సమాజం మీద మీ సినిమా చూపించాలని ఆశిస్తున్నా. అన్నారు.

చిత్ర దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ…  ప్రపంచ గతిని మార్చేశక్తి స్త్రీలకు ఉంది అనేది మా నమ్మకం. హింస, తేడాలు లేని గొప్ప సంఘాన్ని స్థాపించగల శక్తి మహిళ సొంతం.  మహిళ నాలుగు గోడలకు పరిమితం కాకుండా  తల్లులందురూ ఏకమవ్వాలి   సమాజాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తమ అభిప్రాయాలను గొంతెత్తి చెప్పాలి. అలా ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ అని చెప్పారు.  సహజమైన భావోద్వేగాలు చూపించే నటి   రేవతి ఈ సినిమాలో మ‌మేక‌మై చేసింది, అంకురంలా దీనిని ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది  అన్నారు.

చిత్ర‌ నిర్మాత బొమ్మక్ మురళి మాట్లాడుతూ…  స్త్రీ బాగుంటే దేశం బాగుంటుంది.  చట్టాలు స‌రిగా అమలు చేస్తే రాజకీయ రంగంలో స్త్రీ భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఇట్లు అమ్మ చిత్ర క‌థ విన్నా….క‌థ విన్నాక మాకు గుర్తొచ్చిన ఒకే ఒక నటి రేవతి గారు. ఆమె లేకుంటే ఈ సినిమా నిర్మించేవాళ్లం కాదు. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. దీంతో తో ఓ మంచి చిత్రాన్ని నిర్మించాలనే నా కల నెరవేరింది. త్వ‌రలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.

చిత్ర ప్ర‌ధాన పాత్ర‌ధారి న‌టి రేవతి మాట్లాడుతూ…మధ్య వయస్సులోనూ మ‌నం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని, అదే స‌మాజంలో మార్పు తీసుకురాగలదని చెప్పే ఒక అమ్మ ప్రయాణమే ఈ సినిమా.  అద్భుతంగా రాసిన కథ రాసిన ద‌ర్శ‌కుడు  ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్న రాత్రి అనే వాక్యంతో కథ మొదలువుతుంది. ఈ ఒక్క సన్నివేశం చిత్రీకరించేందుకు దర్శకుడు 12 రాత్రులు తీసుకున్నారు. అంటే  సహజత్వంతో కోసం ఎంత ప్ర‌య‌త్నించారో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఇట్లు అమ్మ సందేశాలు ఇవ్వదు. గొంతెత్తి కేకలు వేయదు. మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. అని మాత్రం చెప్ప‌గ‌ల‌న‌ని అన్నారు.

ఈ వేడుక‌లో  సినిమాటోగ్రాఫర్ మధు అంబట్ ,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగులపల్లి కనకదుర్గ  తదితరులు  మాట్లాడారు. 

Leave a Reply

Your email address will not be published.