`యాత్ర‌` థాంక్స్ మీట్‌!

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాత్రలో మ‌మ్ముట్టి న‌టించిన చిత్రం ‘యాత్ర’. మహి.వి.రాఘవ దర్శకుడు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో

దర్శకుడు మహి.వి.రాఘవ్ మాట్లాడుతూ ‘‘ఒక సినిమాని నంబర్‌తో వెల కట్టొచ్చు కానీ అభిమానాన్ని, కళని ఎవరూ వెలకట్టలేరు. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు, వైఎస్సార్‌ అభిమానులు చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేను. వారి విషయంలో రుణం తీర్చకోవడం అన్న మాట చాలా చిన్నదవుతుంది. ఆయన మీద ఇంత అభిమానం ఉందని ముందు నాకు తెలిస్తే అంచనాలు చేరుకుంటామా లేదా అన్న భయంతో అసలు ఈ సినిమా తీసేవాడిని కాదేమో. ‘మాతృదేవోభవ’ సమయంలో ఓ తల్లి గురించి ఇంతగా బాధపడ్డాం. ‘పితృదేవోభవ’ అన్నట్లుగా అభిమాన నాయకుడి కథను సినిమాగా మా కళ్ల ముందుంచారు’ అని చాలామంది ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత నాపై చాలా రకాల ముద్రలు పడొచ్చు. అయినా ఫర్వాలేదు. ఎదుటి వ్యక్తని అగౌరవ పడేలా చేయడం నాకు రాదు. నేను నమ్మిన కథను చెప్పాలనుకున్నట్లు చెప్పా. ఆ విషయంలో నేను సక్సెస్‌ అయ్యానని ప్రేక్షకులే నిర్ణయించారు’’ అని అన్నారు.

నిర్మాత విజయ్‌ చిల్లా మాట్లాడుతూ ‘‘మా సంస్థలో వచ్చిన మూడు సినిమాలు మూడు విభిన్న కథలతో వచ్చినవే. ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొత్త తరహాగా అందించాలన్నదే మా ప్రయత్నం. వైఎస్సార్‌ బయోపిక్‌ గురించి మహి చెప్పగానే ‘వివాదాలు, విమర్ళలు అవసరం అంటావా?’ అనడిగా. ఆయన చెప్పిన రైతు సన్నివేశానికి పడిపోయా. ‘నేను విన్నాను.. నేనున్నాను’ అన్న డైలాగ్‌ నాపై ఎంతో ప్రభావం చూపడంతో ఈ సినిమా చేశాం. విడుదలైన రోజు నుంచీ ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని చూపించడంతో ఎక్కడా విమర్శలు రాలేదు. కొందరు రాజన్నను మళ్లీ గుర్తు చేశారని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రేంజ్‌లో సక్సెస్‌, ఓపెనింగ్స్‌ ఉంటాయని ఊహించలేదు. కేరళ ప్రేక్షకులకు వైఎస్సార్‌ తెలియొచ్చు.. తెలియకపోవచ్చు.. కానీ మమ్ముట్టిగారు పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యి అక్కడ కూడా బాగా ఆదరిస్తున్నారు’’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.