తమదాక వస్తే కానీ నొప్పి తెలియదన్న ఓ సామెత వైసిపి మంత్రులకు అచ్చంగా సరిపోతుంది….

శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ ముందు ధర్నా చేస్తే సస్పెండ్ చేసి పారేయాలని తీర్మానం పెట్టిన బుగ్గన మండలిలె మాత్నం తమ పార్టీ సభ్యులతో నినాదాలు, చైర్మన్ ముందు నిరసనలు మాత్రం సమర్థించడం వెనుక ఆంతర్యం ఎవరికి తెలియందన్నది జనం మాట.
నిజమే.. రాజధాని తరలింపు అంశంపై తొలి నుంచి ఏకపక్షంగా తను స్పీకర్‌నని మరచిపోయి రాజకీయ రంకెలేస్తున్న తమ్మినేని సీతారాం వ్యవహార శైలిని అంతా తప్పు పడుతున్నా ఆతను మార్చుకోలేదు సరికదా… తన స్థానాన్ని సైతం మరచి విపక్ష సభ్యులపై లం…. కో…. భాష కూడా వాడేసి, నోరు పారేసుకున్న సందర్భాలు అనేకం. పైగా మంగళవారం విపక్ష సభ్యుల నిరసనని అంగీకరించనంటూ తీవ్ర ఆగ్రహావేశాలతో సాధారణ సభ్యుల లెక్కన మైకులు తోసేసి, పెన్ను కోపంగా విసిరేసి, ఉవ్వెత్తున లేచిన ఆగ్రహంతో ఊగిపోయి, సభ నుంచి వాకౌట్ చేసేసారు. ఇది బహుశా ఏపి అసెంబ్లీ చరిత్రలో మొదటిసారేమో. ఓ స్పీకర్ సభ నుంచి వాకౌట్ చేయటం.
మరి శాసనసభలో తమ మంద బలంలో బిల్లును ఆమోదించుకున్న అధికార వైసిపి పప్పులు శాసనమండలికి వచ్చే సరికి ఉడకలేదు. తమదైన బాణీలో ఇక్కడ కూడా వీరంగం ప్రదర్శించిన మంత్రులను ఆది నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకుంటునే ఉన్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రులు తమ నోటికి పనిచెప్పారు.
ఓ ప్రణాళికా బద్దగా ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభం కాగానే బిల్లులు ప్రవేశ పెట్టేందుకు మంత్రులు సిద్దమయ్యారు. అయితే టీడీపీ పక్ష నేత యనమల తాము ముందుగా ఇచ్చిన రూల్ 71 పై చర్చ ప్రారంభించాలంటూ చైర్మన్‌ని డిమాండ్ చేయటంతో అరికాలి కోపం నషాలానికెక్కింది మంత్రులకు . దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తునే, టిడిపిపై విరుచుకు పడుతూ చైర్మన్ టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణల పరంపర గుప్పించడం ఆరంభించారు. తమ వైసీపీ సభ్యులకు సూచనలు చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లేలా చూసారు. దీంతో వారంతా ఛైర్మన్ తీరు పైన అసహనం వ్యక్తం చేస్తూ నినాదాలు చేయటం ఆరంభించారు.
ఇదే ఘటన అసెంబ్లీలో జరిగినప్పుడు విపక్ష సభ్యులు ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేయించిన మంత్రి బుగ్గాన మండలిలో మాత్రం పెద్దల గౌరవం దిగజార్చేలా సొంత సభ్యులను ఛైర్మన్ టీడీపీ ఇచ్చిన రూల్ 71పైన చర్చకు అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉసిగొలపడంవిశేషం. అయిదు సార్లు వరుసగా వాయిదా పడిపా అధికార పక్ష సభ్యులు తాము చెప్పిందే వినాలని స్పీకర్ తమ్మినేని ధోరణిలోనే చైర్మన్‌పై వత్తిడి ఆరంభించారు. అయితే మంత్రుల మాట వినిపించుకోకుండా రూల్ 71 పై ఓటింగ్‌కి సిద్దమయ్యారు. ఈ విషయమై మంత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు.
నిజానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న దూకుడు వైఖరిని అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం పార్టీకి దొరికిన ఏకైక బ్రహ్మాస్త్రం ఇది. ప్రస్తుతం దీన్నే ప్రయోగించింది టీడీపీ. ఈ బ్రహ్మాస్త్రం గురి తప్పలేదు. లక్ష్యాన్ని ఛేదించిందనే చెప్పాలి. కొన్ని రోజు పాటైనా అమరావతి రాజధాని తరలింపు అంశం ఆగేందుకు పన్నిన వ్యూహం ఫలించింది.
ఇంతకీ రూల్ 71 ప్రకారం శాసన మండలి నిబంధనల్లోని కీలకమైనది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారాన్ని ఈ రూల్ ద్వారా శాసన మండలి సభ్యులకు సంక్రమిస్తుంది. అది ఎలాంటి నిర్ణయమైనా గానీ, శాసన సభలో ఆమోదం పొందినదైనప్పటిదైనా గానీ.. ఈ రూల్ కింద వ్యతిరేకించే అధికారం మండలి సభ్యులకు ఉంది. ఏ పార్టీకి సంబంధించిన సభ్యుడెవరైనా కూడా ఈ రూల్‌ను లేవనెత్తవచ్చు. దీనికోసం ఛైర్మన్ ముందస్తుగా ఛైర్మన్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. రూల్ 71 అంశానికి అనుగుణంగా మండలిలో చర్చ కొనసాగాలంటే దీనికి అనుకూలంగా కనీసం 20 మంది సభ్యుల బలం ఉండాలి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో 26 మంది సభ్యుల బలం ఉండటం వల్ల ఆ పార్టీకి ఢోకా లేదు. సభలో రూల్ 71 తీర్మానాన్ని ప్రస్తావించిన తరువాత వారం రోజుల్లో చర్చకు అనుమతించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే గణతంత్ర వేడుకలను తొలుత విశాఖలో జరిపి సత్తా చాటాలనుకున్న ప్రభుత్వం అక్కడ విద్యార్ధులతో, పోలీసులు, నేవీ, మిలటరీ విభాగాలతో కవాతులు, ప్రదర్శనల రిహార్సులు అన్నీ చేయించుకుని ఇప్పుడు దీనిని విజయవాడకే మార్చుకోవాలసి వచ్చిందంటే టిడిపి వ్యూహం ఫలించిందనటానికి సూచిక. తెలుగుదేశం వ్యూహాన్ని గమనించిన అధికార పార్టీ తమతో కలుపుకునేందుకు కొందరు టిడిపి ఎమ్మెల్సీలకు గాలం వేసింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీలు 71కు వ్యతిరేకంగా ఓటు వేయటం గమనార్హం.
బిల్లు పై చర్చ జరిగే ఆస్కారం లేక పోవటంతో ఓ దశలో మంత్రులు నేరుగా ముఖ్యమంత్రికి పరిస్తితి తెలియజేసారు. ఒకవేళ చర్చ జరగకుంటే వెనక్కి వచ్చేయాలని, ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు అడ్డుకట్ట పడటాన్నితనే నివారిస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయంగా మండలిని రద్దు చేసే వివాదాస్పదమైన నిర్ణయానికి తీసుకోవడానికి వెనుకాడబోనని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
శాసన మండలి రద్దు విషయం కేబినేట్ ప్రత్యేక సమావేశం జరిగి తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నాయకులు సంధించే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి అంతా సిద్దంగా ఉండాలని, గతంలో ఎన్టీ రామారావు మండలిని రద్దు చేసిన అంశాన్ని అడ్డుగా పెట్టుకోవచ్చని వైసిపి నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తనను విమర్శిస్తే.. ఎన్టీ రామాారావును విమర్శించినట్టేననే ప్రచారానికి శ్రీకారం చుట్టాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అయితే మండలి ఎన్టీఆర్ హయాంలో రద్దయినా. జగన్ తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునఃర్ప్రారంభమైందని, మరి దాని రద్దుద్వారా వైఎస్‌ని కొడుకే అవమానిస్తున్నాడనుకోవాలా? అన్న సెటైర్లు ఇప్పుడు సామాజిక మీడియాలో కనిపిస్తున్నాయి. మరి ఏం జరగనుందో చూడాలి.