కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండలి వ్యవహారం ఆధారపడి ఉంది

శాసనమండలిలో తాను అనుకున్న పనులను బిల్లుల రూపంలో విపక్షం అడ్డుకుంటోందన్న భావనలతో మండలిని రద్దు చేయాలన్నది సిఎం జగన్ ఆది నుంచి తలస్తూ వస్తున్నారు. అయితే వైఎస్ హయాంలో దాదాపు రెండేళ్లు నిరీక్షించి పునరుద్దరించిన మండలిని రద్దు చేయటం అంటే పెద్దాయన ఆకాంక్షలను తుంగలొ తొక్కినట్టేనని భావిస్తున్న కొందరు నేతల మాటకు తలొంచినట్టు తొలినాళ్లలో కొనిపించినా, తాజా గా మూడు రాజధానుల వ్యవహారంలో ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు మండలి నుంచి తిరస్కరణ లేకుండా సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయించడంతో జగన్ ఉలికి పడ్డారనిపిస్తోంది. దీంతో ఎక్కడో చిర్రెత్తుకొచ్చి, ఖర్చు దండగ అంటూ మండలిని తీసి పారేసేటందుకు నడుం బిగించారన్నది ఆయన మాటలలోనే పలు మార్లు ధ్వనించింది. దీంతో సోమవారం ఏపీ కేబినెట్ అంతా అనుకున్నట్లుగానే శాసనమండలి రద్దుకు ఆమోదముద్ర వేసింది.
‘అమరావతి రద్దు… శాసన మండలి రద్దు’ ‘ఒకే రాష్ట్రం.. ఒకేసభ’ అంటూ మంత్రులు నినదించినా అది జరగటానికి చాలా సమయం పట్టే ఆస్కారం ఉంది. అయితే తన పార్టీకి చెందిన వారికి రాజకీయంగా నష్టం రాకుండా చూసుకుంటానన్న ప్రధాన హామీ ఇస్తూ, టీడీపీ ఆధిపత్యం ఇక కొనసాగకూడదనే మండలి రద్దుకు ఆమోదం తెలిపారన్నదీ నిజం. బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. దీనికి కౌంటర్ గా ప్రభుత్వం మండలినే రద్దు చేయాలని నిర్ణయించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
మండలి రద్దు వ్యవహారం అంత సులువుకాదన్నది న్యాయ నిపుణుల మాట. ఒకవేళ రద్దు చేయాలన్న తీర్మానంతో నే అది రద్దు కాదని, కేంద్ర ఆమోదం, రాష్ట్రపతి అంగీకారం అన్నీ కావాల్సి ఉంటుందన్నది యదార్ధం. అక్కడ ఆమోదం పడగానే చట్టం అవుతుంది. అప్పటి వరకు శాసనమండలి సభ్యులు సాంకేతికంగా ఎమ్మెల్సీలుగా ఉంటారు మండలి సైతం యధావిధిగా కొనసాగుతుందని..సమావేశాలు సైతం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మండలి రద్దు తీర్మానం ఆమోదించటంతో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నా. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందని..మూడు నెలల నుండి సాధ్యమైంత త్వరగా నివేదిక కమిటీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మండలి సమావేశాలు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు యధాతధ స్థితి కొనసాగుతుందని ఇందులోని సభ్యలుకు కూడా ఢోకా ఉండదన్నది వారి మాట. కాగా మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానం ఆమోదానికి దాదాపు ఆరు నెలల నుండి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఇక, శాసనసభలో మెజార్టీ ఉన్నప్పటికీ..మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినా.. తుది ఆమోదం వచ్చే వరకూ ఇప్పుడు అనుసరిస్తున్న ప్రక్రియనే కొనసాగించాల్సి ఉంటుంది. తాజా పరిణామాల నడుమ ఇప్పుడు కేంద్రం నిర్ణయం కీలకం కానుంది.
అయితే, కేంద్రం వద్ద అనేక తీర్మానాలు పెండింగ్ లో ఉన్నాయని చెపుతున్న టీడీపీ ఈ మొత్తం ప్రక్రియకు కనీసం రెండేళ్ల వరకు పడుతుందని అంచనా వేస్తోంది. కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2017లోనే రాష్ట్రాలలోని మండళ్ల రద్దుపై ఆలోచనలు చేసిందని.. దీనికి అనుగుణంగానే జగన్ నిర్ణయం తీసుకోవటంతో బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం తమ బిల్లు ఆమోదించే అవకాశం ఉందని వైసిపి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అయితే హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వ్యవహారంలో గాలి చూపులు చూస్తున్న రాష్ట్ర సర్కారు ఆ విషయంపై అసెంబ్లీ తీర్మనాం మాత్రం చేయటం లదేని, ప్రజా ప్రయోజనాలతో ముడి వడిన అంశాలని పక్కకు పెట్టి కేవలం తన కక్ష సాధింపు కోసమే రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి పణంగా పెడుతున్నట్టు విపక్షాలు మండి పడుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే మండలి వ్యవహారం ఆధారపడి ఉంది. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.