బీజీపీ పదాధికారుల భేటీకి బిజెపి ఎంపీలు డుమ్మా కొట్టడానికి కారణం ?


ఏపీలో బిజెపి నేత‌ల మ‌ధ్య విభేదాలు ప్ర‌స్ప‌ష్టంగా క‌నిపించాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని స్ధానిక సంస్ధల ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న త‌రుణంలో విజయవాడలో జరుగుతున్న బీజీపీ పదాధికారుల భేటీకి బిజెపి ఎంపీలు డుమ్మ‌కొట్టారు.  కేంద్ర బడ్జెట్ పై  వెల్లువెత్తుతున్నవిమర్శలు తిప్పికొట్టేలా  పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు  ఈ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, వాకాటి నారాయణరెడ్డి, మాధవ్ తో పాటు సీనియర్ నేత పురంధేశ్వరి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కానీ గ‌త ఏడాది టీడీపీ నుంచి బిజెపిలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ మాత్రం హాజరు కాక‌పోవ‌టం కాషాయదళంలో చర్చనీయాంశమవుతోంది.

గ‌త కొంత కాలంగా రాష్ట్ర రాజ‌కీయాల‌పై,రాజ‌ధానుల‌ వ్య‌వ‌హారంపై ప‌లు ప్ర‌స్తావ‌నల‌ను ఈ ఎంపిలు మీడియా ముందు చేయ‌టం, వాటికి భిన్నంగా జివిఎల్ చెప్ప‌డం, పైగా ఎవ‌రేం చెప్పినా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, త‌ను చెప్పిందే అంతిమం, అధికారికం అంటూ ప‌దే ప‌దే త‌మ‌ని కించ‌ప‌రుస్తున్నార‌ని ఈ ఎంపిలు ఇప్ప‌టికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన నేప‌థ్యంలో స‌మావేశానికి హాజ‌రు కాకూడ‌ద‌ని నిర్న‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. 

గ‌తంలోనూ జివిఎల్‌తో  మూడు రాజధానుల వ్యవహారంతో పాటు ఆంగ్ల మాధ్యమం  ఇలా అనేక అంశాల‌పై విభేదాలుండ‌టం, దీనికి తోడు కన్నా నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న వీరంతా  ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ క్ర‌మంలోనే  పార్టీ అధికారికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని  లైట్ తీస్కోమంటూ త‌మ ప‌రివారానికి ఎంపీలు సంకేతాలు పంప‌డం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

 
 

Leave a Reply

Your email address will not be published.