సామజవరగమనా పాట లో ధోషాలున్నాయన్న సంగీతజ్ఞులు…

సామజవరగమనా అంటూ అల వైకుంఠ పురంలో సాగిన పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. యుట్యూబ్ లో కొన్ని కోట్ల వ్యూస్ అందుకున్న ఈ పాట చిత్రీకరణలో అనేక ధోషాలున్నాయంటూ ఇప్పుడు సామాజిక మీడియాలో చర్చకు తెరలేచింది. సామజవరగమనా త్యాగరాయ కృతి. సామజవరవరగమనా అంటే ఏనుగు లాంటి దర్పమున్నగంభీరమైన నడక కలవాడా అనే అర్థమని సంగీతజ్ఞులు చెపుతారు.
అయితే అల వైకుంఠ పురంలో… ప్రేమలో పడిన హీరో తన హీరొయిన్ ని ఊహించుకుంటూ వేసుకునే డ్రీం సాంగ్ అది. పైగా హీరోయిన్ కాళ్ళు తొడలు చూపించడంపైనే సంగీత సాహిత్య ప్రియులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా పాటల రచనలోనే కాదు ఇటు సాహిత్యంలో లబ్దప్రతిష్టులుగా పేరున్న సిరివెన్నెల సితారామశాస్త్రి ఈ తరహాలో పాట రాయడం పట్ల సాహితీ లోకంలో విస్మయం వ్యక్తమవుతోంది.
సామజవరగమనా లాంటి పవిత్రమైన త్యాగరాజ కృతిని ఇలా భ్రష్టు పట్టించారని, అమ్మాయిని వర్ణించడానికి వాడుకోవడం ఏంటని కొందరంటుంటే… ప్రతిది భూతద్దంలో చూడకూడదన్న వాళ్ళు లేకపోలేదు. గతంలో బాలకృష్ణ టాప్ హీరో సినిమాలో, వంశీ లాయర్ సుహాసిని సినిమాలోనూ ఇదే తరహాలో ఇదే కృతిని వాడుకోగా, విశ్వనాథ్ శంకరాభరణం చిత్రంలో మాత్రం ఈ కృతిని సందర్భశుద్ధిగా వాడటం కనిపిస్తుంది. ఈ పాట ఇంత పెద్ద హిట్ అయినా ఇందులో సాహిత్యం గురించి సిరివెన్నెల వారు ఎక్కడా కనీసం వివరణ కాని దాని గురించి ప్రస్తావించడం కాని చేయకపోవడం గమనార్హం. గతంలోనూ వెంకటేశ్వర సుప్రభాతం పవన్ కళ్యాణ్ చిత్రంలో…. హీరోయిన్ సౌందర్యాన్ని అభివర్ణించే క్రమంలో వాడేసుకున్నారు.
సంగీత దర్శకులు ఇలా ఇష్టానుసారంగా సంప్రదాయ సంగీతాన్నితమకు నచ్చిన తీరుగా మార్చేయటం అంటే మన పూర్వీకులు అందించిన సంగీత ప్రక్రియలను భావితరాలకు భ్రష్టు పట్టించి అందజేయటమేనని సాహితీ వేత్తలు, సంగీత ప్రావీణ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎంత వరకు సినీ జనాలు పట్టించుకుంటారో చూడాలి.