స్ధానికం త‌రువాతే నామినేట్ పోస్టుల భ‌ర్తీ

సంక్రాంతి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆలోపు పార్టీ బలాన్ని మరింత పెంచుకునే వ్యూహాలు పన్నుతోంది వైసిపి. ఈ క్ర‌మంలోనే సమరం లో పార్టీ అభ్య‌ర్దుల‌ను విజేత‌ల‌ను చేసే వైసీపీ నేతలకు నామినేటెడ్ ప‌ద‌వులంటూ అధిష్టానం చెప్ప‌క‌నే చెపుతుండ‌టంతో గ‌త ఆరునెల‌లుగా పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా నీరుగారిపోతున్నారు. 
పంచాయతీలు, మున్సిపాలిటీలు, నీటిపారుదల సంఘాలు పదవీకాలం ఎప్పుడో ముగిసింది. అయినా ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల జరుపుతామని సీఎం జగన్ ప్రకటించినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. సంక్రాంతి తర్వాతే లోకల్ ఎన్నికలు నిర్వహించి, అందులో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉందని పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. అయితే రూరల్‌లో పార్టీ మూలాల‌లోకి వెళ్లి బలంగా ఉన్నప్పటికీ అర్బన్‌లో మరింత బలపడాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్ర‌ధానంగా స్థానిక ఎన్నికలపై దృష్టి సారించ‌డం ద్వారా వైసీపీ క్యాడర్లో ఉత్సాహం నింపాల‌న్న‌ది పార్టీ వ్యూహంగా క‌నిపిస్తోంది. అందుకే ఈ ఎన్నిక‌ల‌ను టార్గెట్‌గా తీసుకుని పార్టీ కోసం అహర్నిషలు పాటుపడిన వారు రూరల్ ప్రాంతాల్లోని నాయకులకు టిక్కెట్లు ఇస్తునే ఈ ఎన్నికల బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకులే తీసుకుని అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల‌ని ఇప్ప‌టికే జగన్ సూచించారు. 
రూరల్, అర్బన్‌లలో పార్టీ బలోపేతంలో భాగంగా అభ్యర్థుల ఎంపిక కూడా చాలా కీలకమని, గెలుపే ల‌క్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ నిర్వ‌హిస్తూ, ఇతర పార్టీ నేతలను పార్టీలోకి తీసుకోవాల‌ని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. ఇటు వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యతలను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అసమ్మతి వర్గం లేకుండా ఎవరికి సీటు కేటాయించినా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం , అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేలా చూడాలని, అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలని మంత్రులకు సీఎం సూచించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published.