విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ?


 విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ? ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ అంశంపై చాలా రోజుల నుంచి వైసీపీ నేతలు స్కెచ్‌లు తయారు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ సూచన మేరకు వైసీపీ నేతలు విశాఖ పరిసరాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. అందుకే.. సీఎం జగన్ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు.
సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన ఒక వ్యూహం ప్రకారమే చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను పోరాట యాత్రలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర భూములు చాలా వరకు వైసీపీ నాయకులూ చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు చెప్పారని తెలిపారు. విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకొంటూ వచ్చారని ఆరోపించారు. అలాగే వివాదాస్పద భూముల పంచాయతీలు మొదలుపెట్టారని చెప్పారు. విలువైన భూముల రికార్డులు లేవని, వాటిపై కఠినంగా ఉన్న జాయింట్ కలెక్టర్ శివశంకర్ లోతేటిని ఆగమేఘాలపై తప్పించి.. అక్కడే కింది పోస్టుకు మార్చి అవమానించారని పేర్కొన్నారు. ఆ పోస్టులో తమకు అనుకూలమైన వేణుగోపాలరెడ్డిని నియామించారని ఆరోపించారు. ఈ హడావిడి బదిలీ వారం రోజుల కిందటే చేశారని చెప్పారు. ఇలా చేయడాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా తప్పుబుడుతున్నారని తెలిపారు. అయినా సీఎం జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. ఇక ఇక్కడ పులివెందుల పంచాయతీలు మొదలవుతాయని వ్యాఖ్యానించారు.
‘సీజన్లో ,కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా- సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెలేలు లెజిస్లేటివ్ రాజధానికి వాలి వెళ్ళాలన్నమాట. మూడు సీజన్లలో అమరావతికి వచ్చి సభ నడిపి ఆ తరవాత తాళాలు వేసేయాలనేది జగన్ రెడ్డి గారు ఆలోచనలా ఉంది. అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటుపడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్ళని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా? రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదని, కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమేనని అన్నారు. వారికయ్యే వ్యయప్రయాసలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు ’ అని పవన్ ప్రశ్నించారు.
మొత్తం మీద.. ఉత్తరాంధ్రలో భూబకాసురులుగా పేరు పొందిన ఇద్దరు జగన్ పక్కనే ఉన్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి మీద జగన్ పోరాడాలి అంటే ముందు తన పక్కన ఉన్న అవినీతిపరులని వదిలించుకోవాలని విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.