యంగ్ హీరో నితిన్ తో ..చిట్ చాట్

యంగ్ హీరో నితిన్, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శక‌త్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం `భీష్మ‌`. ఫిబ్ర‌వ‌రి 21న ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌స్తున్న  సంద‌ర్భంగా యంగ్ హీరో నితిన్ మీడియాతో సినిమా విశేషాల‌తో పాటు అనేక సొంత విష‌యాల‌నూ ముచ్చ‌టించారు. ఆ విశేషాలు మీ కోసం
త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. కంగ్రాట్స్..  మీ ప్రేమ వ్య‌వ‌హారం అంతా దాచిన‌ట్టున్నారే?
అవును… ఒక ప్లాన్ ప్రకారమే మేం ఎక్కడా మా ప్రేమను బయట వ్యక్తం చెయ్యకుండా ఉంచాం. ఇద్ద‌రం మీడియా అటెన్షన్ ఒద్దనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది నా ఆలోచన కాదు. శాలిని, ఆమె తల్లిదండ్రులు, మా అమ్మానాన్నల ఆలోచన.బ్యాచిలర్ లైఫ్ ముగిసిపోతోందంటే …నాకంటే నా తోటి హీరోలు చాలా ఆనందపడుతున్నారు. నాని ‘దాదా’ అంటున్నాడు. రానా, వరుణ్ తేజ్ కూడా కామెట్ చేస్తున్నారు. నాకైతే ఇప్పటికే చాలా లేటైపోయిందనిపిస్తోంది.  ఇక పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న నన్ను ఎవ్వరూ అడగరు. ఫైనల్ గా పెళ్లి అయిపోతుంది కదా.
మీ ప్రేమ ఎలా మొద‌లైంది?
2012లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శాలిని పరిచయమయ్యింది. అది స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. నేనే తనకు తొలిసారి నా ప్రేమను వ్యక్తం చేశా. తనూ యాక్సెప్ట్ చేసింది. గత సంవత్సరం ఇద్దరం ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పాం. అప్పటి దాకా వాళ్లకూ ఈ విషయం తెలీదంటే అంతా ఆశ్చ‌ర్య పోతున్నారు. 
పెళ్లికి లేట్ అయింద‌నే ఫీలింగ్ ఏమైనా ఉందా ?  
మీర‌న్న‌ది నిజ‌మే… ఇప్ప‌టికే చాలా లేట్ అయింది, మూడు సంవత్సరాలు ముందే చేసుకోవాల్సింది. కానీ, పెళ్లి అనేది ఒక పెద్ద అడుగు కాబ‌ట్టి నేను మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి కొంచెంటైమ్ పట్టింది , ఆలోచించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 
మీ పెళ్లి ప‌నులు మెద‌లెట్టేసిన‌ట్టున్నారే…
అవును ప‌నులు ఆరంభ‌మ‌య్యాయి.  దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకోబోతున్నాం. 21న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం. 
‘జయం’ నుండి ఎక్కువగా లవ్ స్టోరీలే చేస్తూ వ‌స్తున్నారు. ఆ జోనర్ బోర్ అనిపించ‌లేదా ?
 నేను చేసిన సినిమాల్లో ఎక్కువగా లవ్ స్టోరీలు ఉన్నాయి… అయితే అన్ని సినిమాలు ఒకేలా ఉండ‌వు, కాబట్టి బోరేమీ ఫీలవలేదు.  అయితే ఇప్పుడు డిఫరెంట్ గా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇక లవ్ స్టోరీలు తగ్గిద్దాం అనుకున్నాను. కానీ, ‘రంగ్ దే’ కథ విన్నాక అది నాకు బాగా నచ్చేసింది.  నేను 24 ఏళ్ల యువకుడిగా కనిపిస్తా. మళ్లా అలాంటి క్యారెక్టర్ చెయ్యలేను కాబట్టి ఒప్పుకున్నా. లాస్ట్ లవ్ స్టోరీగా ఆ మూవీ చేస్తున్నాను.   అందుకే దాన్ని వదులుకోలేదు.   యేలేటి గారి సినిమా చేస్తున్నా. ‘అంధాధున్’ డిఫరెంట్ సినిమా, ‘పవర్ పేట’ డిఫరెంట్ సినిమా.
‘భీష్మ’ చేసే టైంలోనే మరో రెండు సినిమాలూ చేస్తుంటే, క్యారెక్టర్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవలేదా?
ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ కాబట్టి కన్ఫ్యూజ్ కాలేదు. వెంకీ కుడుములకు డైలాగ్స్ చెప్పేటప్పుడు కళ్లార్పడం ఇష్టముండదు. అదే యేలేటి గారైతే, కళ్లు ఆర్పమంటాడు. ఎప్పుడైనా కాస్త కన్ఫ్యూజ్ అయినా ఆ డైరెక్టర్లే మళ్లీ తమ క్యారెక్టర్ లోకి నన్ను తీసుకొచ్చేవాళ్లు. కానీ ఇంకెప్పుడూ లైఫ్ లో ఒకేసారి మూడు సినిమాలు చెయ్యనండీ బాబూ.. నిద్ర లేదు, రెస్ట్ లేదు. ఎప్పుడైనా ఒకరోజు గ్యాప్ వస్తే, ఆ రోజు తమకు కావాలని ముగ్గురూ కొట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ‘భీష్మ’ అయిపోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. యేలేటి గారితో చేస్తున్న సినిమా పేరు ‘చెక్’. చెస్ ఆటలో ‘చెక్’ అనే మాట వస్తుంది కదా.. అదే.
వెంకీ కుడుముల మీకు ‘భీష్మ’ కథ ఎప్పుడు చెప్పారు ?
నేను ‘శ్రీనివాస కల్యాణం’ చేసేటప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ లైన్ చెప్పాడు. నాకు నచ్చింది.  ఆ తరువాత ఆ లైన్ ను ఫుల్ స్క్రిప్ట్ గా డెవలప్ చెయ్యడానికి సంవత్సరం టైం తీసుకున్నాడు. అప్ప‌టికే నా మూడు సినిమాలు ఆడలేదు కాబట్టి, ఈసారి స్క్రిప్ట్ పక్కాగా లాక్ చేసుకున్నాకే మొదలు పెడదామని అనుకున్నా. అలా వన్ ఇయర్ లేట్ గా సినిమాని మొదలు పెట్టాము. ఈ టైంలోనే ‘రంగ్ దే’ స్క్రిప్ట్, చంద్రశేఖర్ యేలేటి సినిమా స్క్రిప్ట్ కూడా విని ఓకే చేశాను. వాటి పూర్తి స్క్రిప్టులు అయ్యాకే మూడింటినీ మొదలుపెట్టాను. అలాగే కృష్ణచైతన్య చెప్పిన ‘పవర్ పేట’ స్క్రిప్ట్, హిందీ సినిమా ‘అంధాధున్’ రీమేక్ కూడా ఓకే ఛేశాను. లాస్ట్ ఇయ‌ర్ ఖాళీగా ఉన్నాను కానీ ఈ ఏడాది బహుశా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి.
ట్రైల‌ర్ చూస్తే ‘భీష్మ’లో ఆర్గానిక్ కి సంబంధించి మెసేజ్ కూడా ఉంది, మరి సినిమా ఎలా ఉండబోతుంది ?
దిల్’ తర్వాత నేను చేసిన లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ఈ సినిమా. యాక్షన్ కూడా మిళితమై ఉంటుంది. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రధానాంశం కాదు.అది కథలో ఒక ఎలిమెంట్ మాత్రమే. భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ ఉంటుంది. అందులో నేనొక ఉద్యోగిని. ఆర్గానికి ఫార్మింగ్ అంటే దాని గురించిన సినిమా అని అంటారేమోనని దాన్ని ప్రమోషన్స్‌లో ఎలివేట్ చెయ్యలేదు. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు.
 
ట్రైలర్లో ఒక ఫైట్ ‘అతడు’లోని పొలం ఫైట్ ను గుర్తు చేస్తోంది. దాని స్ఫూర్తితో తీశారా?
– కరక్టే. ‘అతడు’లోని పొలం ఫైట్ ను దృష్టిలో ఉంచుకొనే దాన్ని తీశాం. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. అత‌డు స్థాయిలో ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది.
సంగీతానికి ప్రాముఖ్యం ఉన్నట్లు కనిపిస్తోంది…
– అవునండీ. మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘వాటే బ్యూటీ’ కానీ, ‘సరాసరి గుండెల్లో’ కానీ, సింగిల్స్ యాంథెం కానీ.. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు.
మ‌రి మొదట మహతిని కాకుండా వేరే  చాయిస్ కు వెళ్దామని మీరు అన్నట్లు వినిపించింది నిజమేనా?
నిజమే. అంతా ‘ఛలో’ టీం అయిపోతోందని, మహతినైనా మార్చమని వెంకీకి చెప్పా. మహతితో తనకు బాగా సింకవుతుందనీ, అతడితోనే మ్యూజిక్ చేయిద్దామనీ వెంకీ అనడంతో సరేనన్నా. మహతి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి వెంకీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.
డాన్సుల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు?
– చివరిగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఎక్కువ డాన్స్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ డాన్స్ చెయ్యలేదు. ఈ సినిమాకు ముందే అనుకొని డాన్స్ చేసాం. తెరమీద నా డాన్స్ చూసినవాళ్లు కచ్చితంగా ఇష్టపడతారు.
రష్మికతో పనిచేయడంపై ఏమంటారు?
తెరపై రష్మిక అద్భుతంగా ఉంది. చక్కని నటి. మా మధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు.
మీ ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎందుకట్టా… ప్రమోషన్ కోసమేనా?
లేదండి! ‘జయం’ నుంచి నా ప్రతి సినిమాలో ఆయన ప్రస్తావన ఉంది. సినిమాల‌లో పవన్ కళ్యాణ్ గారి సాంగో, ఆయన పోస్టరో, ఆయన మ్యాడులేషనో ఏదో రకంగా ఆయన నా సినిమాలో కనిపిస్తారు. లేదా వినిపిస్తారు.. ‘ఇష్క్’తో సక్సెస్ వచ్చాక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఆయనపై నాకున్న ప్రేమ.  .  మీరు ఎంత దాని గురించి రాసినా, ఎవరు ఎన్ని అనుకున్నా నేను ఆయనకి జెన్యూన్ అభిమానిని. దాన్ని పెడుతూనే ఉన్నా. అది నా లవ్. అంతే!
ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది. మీ నుండి వినూత్నమైన సినిమాలు ఆశించొచ్చా ?
– నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతుంది. నా కెరీర్ గ్రాఫ్ కూడా చాలా వేరియేషన్స్ తో సాగింది. మంచి ఎక్స్ పీరియన్స్. ఇక నేను కూడా వినూత్నమైన సినిమా చేయాలని ఉద్దేశ్యంతోనే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారితో ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ని అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌ని బ్యాలెన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నా..
నిర్మాణ విలువల గురించి ఏం చెబుతారు?
– సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నానంటేనే ఈ బ్యానర్ అంటే ఎంత ఇష్టపడుతున్నానో మీరే ఊహించుకోండి. వీళ్లు తీసే అన్ని సినిమాల్లో నిర్మాణ విలువలు హై లెవల్లో ఉంటాయి. ‘అ ఆ’ మూవీ నుంచి ఈ బ్యానర్ తో నా జర్నీ మొదలైంది. ‘భీష్మ’ తర్వాత మళ్లీ ఇదే బ్యానర్ తో ‘రంగ్ దే’ చేస్తున్నా. దాని తర్వాత కూడా మరో సినిమా చేద్దామని నిర్మాత నాగవంశీ అంటున్నారు.
 
మీ తదుపరి సినిమాల గురించి ?
– మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నాను, జూన్ నుండి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాము. కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ సినిమా కూడా ఆగష్టు నుండి స్టార్ట్ చేస్తాము. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్‌దే’, చంద్ర శేఖర్ యేలేటిగారితో `చెక్` సినిమా చేస్తున్నాను. అన్నీ కొత్త త‌రహా చిత్రాలే.. దేని క‌దే విభిన్నంగా ఉంటాయి. 

Leave a Reply

Your email address will not be published.