అమరావతి రైతు జేఏసికి భారీ విరాళాలు

అమరావతిని రాజధానిగా నే ఉంచాలంటూ మూడు రాజధానులు వద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 71వ రోజుకు చేరాయి. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నా రైతులు రోజు రోజుకూ తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేస్తు, ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో రైతులు, మహిళలు ట్రంప్ ఫొటోతో కూడిన ప్లకార్డులను పెట్టుకొని అమరావతికి మద్దతు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సామాజిక మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
‘ప్లీజ్ ట్రంప్ సేవ్ అమరావతి’ అని నినదిస్తూ సాగిన మహాధర్నాతుళ్లూరు, మందడంలలో జరిగాయి. దీనిలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మహిళలు, రైతులు చేస్తున్న దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. సీఎం జగన్ ఆర్థిక ఉన్మాదిలా వ్యవహిస్తున్నారని రైతులను ఇబ్బంది పెట్టిన ఏ నేత బతికి బట్టకట్టిన దాఖలాలు లేవన్నారు. చరిత్రలో ఈ విషయం చూసుకుని వ్యవహరించాలని సూచించారు.
మరోవైపు రైతులు చేస్తున్న ఆందోళనలకు భారీగా విరాళాలు కూడా వచ్చి పడుతుండటం విశేషం. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మహిళలు వచ్చిరైతు జేఏసికి రూ.15,000 అందించగా తెనాలి మండలం కూచిపూడి గ్రామ రైతులు రూ.10,000 విరాళం అందజేశారు. అలాగే ఒంగోలుకు చెందిన ఆచార్య రంగా కిసాన్ సంస్థ రైతు ప్రతినిధుల బృందం సందర్శించి సంఘీభావం తెలపడంతో పాటు సంస్థ తరపున రూ.20 వేలను విరాళంగా అందజేసారు.