బీజేపీ రాజ్యసభ సీట్ ఇవ్వటం కరెక్టే నా వైసీపీ లో అంతర్మధనం …
కేంద్ర పెద్దల సహకారం లేకుంటే.. తను అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్న వైసిపి అదినేత, ఏపి ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఎన్డిఏకి మద్దతు పలికేందుకు సిద్దమైపోతున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని మంత్రి బొత్స సత్యనారాయణతో సహా పలువురు వైసిపి పెద్దలు అయితే తప్పేంటట? అవసరమైతే గడ్డాలు పట్టుకుని బతిమాలుతాం. మాకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం అంటూ ఊదరగొట్టినా… వైసిపి ఎన్డిఏ బాట పట్టడానికి సవాలక్ష కారణాలున్నాయంటూ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది ఇప్పుడు.
ఇప్పటికే హోదా అంశాన్ని తెరమరుగు చేసే ప్రయత్నాలు ఆరంభించిన వైసిపి పెద్దలు, పౌరచట్టం వ్యతిరేకిస్తామని సిఎం జగన్ చెప్పినా, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసే అంశంపై మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారన్నది వాస్తవం. అయితే పంచాయితీ ఎన్నికల తదుపరి కేంద్ర ప్రభుత్వంలో చేరే అంశాన్ని పరిశీలించి చెపుతామని బొత్స సైతం మీడియాకు లీకులు ఇవ్వటం వెనుక ఆంతర్యం ఇదేనని పరిశీలకులు చెపుతున్న మాట.
ఇదిలా ఉండగా మార్చి నెలలో రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి , ఈ రాజ్యసభ ఎన్నికలలో అన్ని సీట్లు దక్కించుకునేంత మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్ పార్టీ ఉన్నారు. అయితే కేంద్రంలో చేరే ముందు ఈ ఎన్నికలలో తమకు రాజ్యసభ సీటు ఒకటి ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను కలిసిన జగన్కు సూచించినట్లు వైసిపి నేతల ద్వారానే బయటకు పొక్కింది. ఈ క్రమంలోనే అభివృద్ధి, రాజధానులు ఇతరత్రా అంశాలను చర్చించేందుకు హోంమంత్రి అమిత్ షాని కలవాలని ప్రధాని సూచించినట్టు చెపుతున్నా… అది రాజ్యసభ సీటుకోసమేననే వాదన బలంగా ఇప్పుడు వినిపిస్తోంది.
ఒక వేళ నాలుగు సీట్లలో గతంలో తెలుగు దేశం పార్టీ ఇచ్చినట్టు బిజెపికి ఒక రాజ్యసభ సీటు ఇస్తే, ఇప్పటి వరకు తమకు అండగా ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలలో తీవ్ర వ్యతిరేకత రావటం ఖాయమని పార్టీ వర్గేలే చెపుతున్న మాట. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేసులు, ఇతరత్రా అవసరాల దృష్ట్యా కేంద్రంలో వైసిపి చేరాల్సిన అవసరం ఉందని, ఎలాగూ మిత్ర పక్షం కాబోతున్నందున రాజ్యసభ సీటు ఇస్తే తప్పేంటట? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు కొందరు.
ఇదే విషయంపై సామాజిక మీడియాలోనూ చర్చ నడుస్తోంది. బిజెపికి ఎలాంటి సభ్యులు లేకుండా రాజ్యసభకు ఆ పార్టీ సభ్యుని పంపిస్తే,,, వైసిపి భవిష్యత్తులో మళ్లీ కోలుకోలేనంత దెబ్బ ముస్లిం వర్గాల నుంచి ఉంటుందని, వైసిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బిజెపికి ఓ రాజ్యసభ సీటు ఇస్తే.. చాలా సమస్యలు పరిష్కారమవుతాయని పార్టీ అంతర్గత సమావేశంలో జగన్ చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులుంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉండకుండా పోతుందని, ఇప్పటికే అనేక సమస్యలను ఇంటా బయటా ఎదుర్కొంటున్న నేపథ్యంలో అన్ని చక్కబడేందుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నారు.
అన్ని పరిస్థితులు కలిసి వస్తేనే.. రాజకీయంగా కమలం పార్టీతో జగన్ ముందుకు వెళతారని సమస్యలను పరిష్కరించు కోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ముందు ముందు ఏం జరిగినా ఆశ్చర్య పడనక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.