శివసేన, ఎన్సీపీ మధ్య అప్పుడే లుకలుకలు

మహారాష్ట్రలో అఘాడీ కూటమి ప్రభుత్వం ఏర్ప‌డి ఇంకా మూడు నెలలు కాక‌ముందే కుమ్ములాటలు  ఆరంభ‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో శివసేన, ఎన్సీపీ మధ్య అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. సీఏఏకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే జై కొడితే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నై అన‌టంతో పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. 


ఇటీవ‌ల బిజేపి స్నేహ‌హ‌స్తాన్ని వీడి సిఎం కావ‌ట‌మే లక్ష్యంగా ఉద్ధవ్ పవర్ చెంత‌కు చేరి ప‌వ‌ర్ అందుకుంటూ ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ విష‌యం విదిత‌మే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)పై శివసేన త‌న మద్దతు ప్రకటించింది. ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ థాక్రే సీఏఏతో ఎలాంటి ప్రమాదం లేదని, ఎన్పీఆర్ అమలు అడ్డుకోబోమని తేల్చిచెప్పారు.


అయితే శివసేన అధికారంలోకి రావ‌టానికి కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ సీఏఏను వ్యతిరేకిస్తామని గతంలో చెప్పిన మాట‌కే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు స్పష్టం చేయ‌టంతో పాటు శివసేనతో చర్చించి ఎందుకు వ్య‌తిరేకించాల్సి వ‌స్తోందో ఆ పార్టీని ఒప్పిస్తామని చెప్పుకొచ్చారు. మ‌రోవైపు భీమా–కోరెగావ్ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్ప‌గించాల‌ని చూసినా… కేంద్రానికి అప్పగించబోమని ప్రకటించడం ద్వారా ఈ విషయంలో పవర్ ను ప్రసన్నం చేసుకునే ప‌నిలో ఉద్ధవ్ ఓ అడుగు ముందుకేసారు. దళిత సోదరులకు అన్యాయం జరగనివ్వం”అని తేల్చిచెప్ప‌డంతో ఎవ‌రు ఎవ‌రి బాట‌లో న‌డుస్తోరో చూడాలిక‌.

Leave a Reply

Your email address will not be published.