అమాంతం పెరిగిన విజ‌య పాలు…!తెల్లారితే  పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌వాళ్ళ వ‌ర‌కు ముందు కావ‌ల‌సింది పాలు. పాలు లేక‌పోతే క‌ష్ట‌మ‌నే చెప్పాలి. తెల్లారితే టీ, కాఫీ, బూస్ట్ అంటూ ర‌క‌ర‌కాల అల‌వాట్లు ఉన్న‌వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంత మంది టీ తాగితేనే గాని  నిద్ర మ‌త్తు దిగ‌దు. మ‌రికొంద‌రు పిల్ల‌లు వేడి వేడి పాలు తాగితేనే గాని బెడ్ మీద నుంచి లేవ‌రు. తెలంగాణ‌లో ఉత్ప‌త్తి అయ్యే విజ‌య పాల ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. పాల ధర పెంచాలని తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ది సహకార సమాఖ్య (టీఎస్‌డీడీసీఎఫ్) నిర్ణయించింది. అంటే ఈ రోజు నుంచి (సోమవారం) నుంచి లీటరుకు రూ.2 చొప్పున పాలధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాడి రైతుల దగ్గర్నుంచి సేకరిస్తోన్ పాల ధరలు పెరగడంతో.. పాల విక్రయ ధరలను కూడా పెంచాలని నిర్ణయించినట్లు టీఎస్‌డీడీసీఎఫ్ తెలిపింది. స్టాండర్డ్ మిల్క్, హోల్ మిల్క్ ధరల్లో మార్పు లేదని యాజమాన్యం పేర్కొంది.

ఇక ఈ పెరిగిన పాల ధరల నేథ్యంలో వెండర్ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు చ‌ప్పున‌,  బేస్ మార్జిన్‌ను రూ. 3.25 పైసలు పెంచినట్లు టీఎస్‌డీడీసీఎఫ్ జనరల్ మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.42కు లభిస్తుండగా.. సోమవారం నుంచి మార్కెట్లో రూ.44కు లభించనుంది.

కాని దీని పైన బాల‌ల హ‌క్కుల సంఘం గొడ‌వ చేస్తుంది. పెంచిన విజయ పాల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారం పాలేనని, తల్లిపాలు అందుబాటులో లేని ఎంద‌రో పసికందులకు పోతపాల మీద ఆధార పడుతున్నారని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు. పాల ధరలను పెంచితే పేద, మధ్య తరగతి పిల్లలు పాలకు దూరం అవుతారని ఆయన అన్నారు.

అమూల్ మిల్క్ కూడా అహ్మదాబాద్, సౌరాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో డిసెంబర్ 15 నుంచి లీటర్ పాలకు రూ.2 చొప్పున పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో లీటర్ పాలకు రూ.3 చొప్పున ధర పెంచుతూ మదర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. ఇలా ఈ విధంగా పాల ధ‌ర‌లు పెరుగుతూ పోతూ ఉంటే చాలా ఇబ్బంది అని బాల‌ల సంఘం డిమాండ్ చేస్తుంది. ఓ ప‌క్క పిండి బ‌డి లాంటి చిన్న పిల్ల‌ల స్కూళ్ళ‌ల్లో పౌస్టికాహార లోపం రాకూడ‌ద‌ని గుడ్డు, పాల‌ను ఇస్తూనే మ‌రో ప‌క్క ఈ విధంగా ధ‌ర‌ను పెంచ‌డం వ‌ల్ల ఇటు పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్ళ‌కు చాలా ఇబ్బంది అనే చెప్పాలి. దీని పై ప్ర‌భుత్వం దృష్టి సారిస్తే మంచిద‌ని బాల‌ల సంఘం కోరుతుంది.

Leave a Reply

Your email address will not be published.