కాట్రేటికోన, అంతర్వేది ప్రాంతాలలో జరుగుతున్న గ్యాస్ లీకేజీలు..

ఆంధ్రప్రదేశ్‌కు వరాల పంటగా మారాల్సిన చమురు, సహజ వాయువుల వెలికితీత కోనసీమ వాసుల గుండెలపై నిప్పుల కుంపటిలా మారిపోతోంది. ఈ వెలికి తీతలో జరుగుతున్న గ్యాస్ లీకేజీలు, విస్ఫోటాలు ఏ క్షణం ఎలాంటి ఉపద్రవం సంభవిస్తుందోనన్న భయాందోళనలు రోజు రోజుకీ మిన్నంటుతున్నాయి.కాట్రేటికోన, అంతర్వేది ప్రాంతాలలో జరుగుతున్న గ్యాస్ లీకేజీలు తీవ్రంగా కలవరపెడుతూనే ఉన్నాయి.
తాజాగా కాట్రేనికోన మండలం ఉప్పూడిలోని గంటివారిపేటలో రిగ్ నుంచి ఆదివారం సాయంత్రం ప్రారంభమైన గ్యాస్ లీకేజీ కొనసాగుతంఉడటం ఇక్కడి ప్రజలని ఆందోళనకి గురిచేస్తోంది. దీనిని అరికట్టేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా ఓకొలిక్కి రాక పోవటంతో పాటు పెద్ద శబ్దంతో గ్యాస్ ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో జనం భయభ్రాతులకు గురి అవుతున్నారు. ఈ గ్యాస్ గాలిలో కలుస్తుండడంతో ఇళ్లలో స్టౌ వెలిగించవద్దని, మండించే పదార్ధాలేవీ కాల్చవద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేసారు. చిన్న నిప్పురవ్వ వెలువడినా పెను ప్రమాదం సంభవిస్తుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆటోలపై మైకుల ద్వారా అధికారులు ప్రచారం చేస్తున్నారు.
ముందస్తు చర్యలలో భాగంగా ఈ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేసి, సమీపంలోని రహదారుల్లో రాకపోకలను అడ్డుకుంటున్నారు. దీంతో చుట్టుపక్కలంతా గాఢాంధకారం అలముకుంది. కనీసం ఇళ్లలో భోజనం చేసే పరిస్థితి కూడా లేకపోవటంతో పాటు గ్యాస్ కారణంగా ఇతరత్రా వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉండటం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా గ్యాస్ లీక్ అయిన ఉప్పూడి గ్రామంలోని 1600 మందిని చెయ్యేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.
కాగా ….ఘటన జరిగిన కొద్దిసేపటికే బావి వద్ద పనిచేస్తున్న ఎఫ్హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు అక్కడినుంచి పరారైనట్లు గ్రామస్తులు చెపుతున్నారు.