శుక్రవారం ఖర్చుల సంగతేంటి?

ఇంతకీ ఏపి సిఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యేది.. వ్యక్తిగత హోదాలోనా లేక అధికారిక హోదాలోనా అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ నేత వర్లరామయ్య. గురువారం ఆయన టిడిపి కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ సీబీఐ కోర్టు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారని దేశ చరిత్రలో సీఎంగా ఉండి కోర్టుకు ముద్దాయిగా వెళ్లింది జగనేనని ఎద్దేవా చేశారు.
వ్యక్తిగత హాజరు నుంచి కొన్నాళ్లుగా మినహాయింపు కోరుతూ అనుమతి తీసుకుంటున్నారని, వరుసగా కోర్టుకు హాజరు కాకపోవడంతో పాటు ముఖ్యమంత్రి హోదాలో కేసు విచారణపై ప్రభావం చూపిస్తున్నందునే ప్రతి శుక్రవారం జగన్, సాయిరెడ్డిలను విచారణలకు రావాల్సిందేనని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. కోర్టు ఖర్చులంటూ ప్రభుత్వం నుంచి భారీగా నిధులు విడుదల చేయించుకునేందుకు సాయిరెడ్డి వ్యూహం రచిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ కేసుల ఖర్చుల వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీడియాకు వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేయాలని సూచించారు. తాము చేసిన తప్పిదాలకు జనం ధనం ఎందుకు ఖర్చుచేయాలని నిలదీసారు. జగన్ సొంత ఖాతా నుంచే భరించాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే పాలనని గాలికి వదిలేసిన జగన్ సీనియర్ మంత్రిని సిఎం ఇన్చార్జ్గా నియమించి, కోర్టుల చుట్టూ తిరగవచ్చని ఎద్దేవా చేసారు.